న్యూఢిల్లీ : సురక్షితమైన డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కీలకమైన వేదిక కాబోతోంది. విశాఖ ఫిన్ టెక్ కేంద్రంగా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్న ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ కార్డ్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇక చేదోడు వాదోడుగా ఉండబోతోంది. కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోగురువారం జరిగిన భారత ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఐటీ సలహాదారు జె.ఏ.చౌదరీ, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ భంగ ఒప్పంద పాత్రలను మార్చుకున్నారు. రైతులు సులభతరంగా డిజిటల్ లావాదేవీలు జరుపుకోవడం, సైబర్ భద్రతకు పలు కార్యక్రమాలు చేపట్టడం, మాస్టర్ కార్డ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వ్యాపార సదస్సులు నిర్వహించడం ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) తో అద్భుతాలు చేయవచ్చు అని అన్నారు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిని ఫిన్టెక్ వాలీకి ఆహ్వానించాలని, అవినీతి వంటి పలు సమస్యలను డిజిటల్ ఎకానమీ పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్ మొత్తం నవీన ఆవిష్కరణలతో కూడిన ఆర్థికవ్యవస్థకు మాత్రమే చోటు ఉంటుందని, దాన్ని ప్రతి ఒక్కరు అంది పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగ మాట్లాడుతూ టెక్నాలజీని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి ముందుచూపు రాష్ట్రాన్ని నూతన స్థాయికి తీసుకోవడంలో సహాయపడుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో మాస్టర్ కార్డ్ వ్యాపార సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సైబర్ భద్రత మరియు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పనిచేయడానికి మాస్టర్ కార్డ్ ముందుకు వచ్చింది.