ప్రాణం కంటే మిన్నగా చూసుకున్నాడు… పెంచి పెద్దవాడిని చేసి ఒక ఇంటివాడిని చేశాడు.. అలాంటి ప్రేమానురాగాలతో చూసుకున్న తండ్రి కన్నుమూయడాన్ని ఆ కొడుకు తట్టుకోలేకపోయాడు..
ఆయన అంతిమయాత్రలోనే తానూ తనువు చాలించాడు..
చివరకు తండ్రి చితి పక్కనే ఆ తనయుడికి అంత్యక్రియాలు చేయాల్సి వచ్చింది.
ఈ విషాద సంఘటన తూర్పుగోదావరిజిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది.
పిఠాపురం వస్తాదు వీధికి చెందిన జాగు అశోక్‌బాబుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఆయన నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పిత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు.
అంతిమ సంస్కారాల కోసం ఆయన భౌతిక కాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు.
రెండవ కుమారుడు శివప్రసాద్ తండ్రి పాడెను మోస్తూ కొంత దూరం వెళ్లగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఏం జరిగిందో తెలుసుకునే లోపే పాడె మోస్తూన్నవాడు ఒక్కసారిగా కిందపడిపోయాడు.
దీంతో అంతిమ యాత్రను అక్కడే ఆపి అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో తండ్రి అశోక్, కొడుకు శివప్రసాద్‌లకు ఒకేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది.
శివప్రసాద్ తండ్రి పట్ల ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడని, ఆయన మృతిని తట్టుకోలేక తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉండిపోయి తీవ్రంగా కుమిలిపోయాడని బంధువులు తెలిపారు.
ఒకేసారి తండ్రీకొడుకుల మృతితో వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తుంటే వారిని ఆపడం ఎవరితరం కాలేదు.. శివప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.