మగధీర రూపంలో కెరీర్లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని నాకు అందించారు రాజమౌళి, విజయేంద్రప్రసాద్. అభిమానులంతా గర్వంగా చెప్పుకునే సినిమాను ఇచ్చారు. ఆ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, తొమ్మిదేళ్లుగా నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవడానికి సరైన సమయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. శ్రీవల్లి సినిమా అందుకు వేదిక కావడం గర్వంగా ఉన్నది అని తెలిపారు రామ్‌చరణ్. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌చరణ్ ప్రీ రిలీజ్ కార్డ్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: మగధీర తర్వాత నేను, విజయేంద్రప్రసాద్ ఇదే వేదికపై మళ్లీ కులుసుకున్నాం. ఈ తండ్రీతనయులు ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ హీరోకు బ్లాక్బాస్టర్ హిట్లనిచ్చారు. బాలీవుడ్లో బజరంగీ భాయిజాన్ తర్వాత ప్రస్తుతం మణికర్ణిక చిత్రానికి కథను అందిస్తున్నారు విజయేంద్రప్రసాద్. ఆ సినిమా మరో బాహుబలి, మగధీర కావాలని కోరుకుంటున్నాను. శ్రీవల్లి విషయానికి వస్తే సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాలను హాలీవుడ్‌లోనే చూశాను. తెలుగులో ఇలాంటి కథాంశంతో సినిమా రావడం ఇదే తొలిసారి. గొప్ప రచయిత కథను రాసి తానే దర్శకత్వం వహిస్తే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా కోసం అందరిలాగే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలో విజయేంద్రప్రసాద్ పేరుంటే చాలు అది జాతీయ సినిమా అయిపోయినట్లే. అంతకుమించి ఎలాంటి ప్రచారం అక్కరలేదు. నిర్మాతలకు ఈ చిత్రం లాభాలను తెచ్చిపెట్టాలి. బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలవాలి అని తెలిపారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ :రామ్‌చరణ్‌తో మా ప్రయాణం మగధీరతో ప్రారంభమైంది. సింహాద్రి తర్వాత చిరంజీవితో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని రాజమౌళిని ఎవరో అడిగారు. దానికి చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి. ఆయనే వరం ఇవ్వాలి. ఆ అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో అని రాజమౌళి చెప్పారు. ఆతర్వాత కొద్ది రోజులకే చిరంజీవి నుంచి మాకు పిలుపువచ్చింది. నాకో సినిమా చేసిపెట్టమని పెద్ద మనసుతో ఆయన అడిగారు. చిరంజీవి అలా అడగ్గానే మాలో కొండంత ఉత్సాహం వచ్చింది. వారం రోజుల తర్వాత మగధీరలో వందమందిని చంపే ఎపిసోడ్‌ను ఆయనకు వినిపించాం. ఆ లైన్ వినగానే ఆయన రోమాలు నిక్కబొడిచాయి. వెంటనే సినిమా చేద్దామని చెప్పారు.
కానీ అనివార్య కారణాల వల్ల ఆయనతో సినిమా చేయలేకపోయాం. చివరకు ఆ సన్నివేశాన్ని మగధీరలో రామ్‌చరణ్‌తోతీశాం. పరుచూరి బ్రదర్స్ కలం, బలం తోడైతే చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో మగధీర-2 చేస్తాను. వినూత్నమైన కథాంశంతో శ్రీవల్లి చేశాను. ఇప్పటివరకూ తెరపై ఇలాంటి కథ రాలేదు. విషాదం నుంచి ఈ కథ పుట్టింది. రమేష్ అని నాకో స్నేహితుడుండేవాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత మా దారులు వేరయ్యాయి. 2010లో వినాయకచవితిరోజు తను చాలా గుర్తొచ్చాడు.ఆ తర్వాత అతడిని కలుసుకునే ప్రయత్నం చేస్తే వినాయకచవితి తర్వాతి రోజు తను చనిపోయాడని తెలిసింది. ఆ సమయంలో రమేష్ నా గురించే అడిగాడని తెలియగానే బాధేసింది.
మనిషికి, మనిషికి మధ్య ఉండే భావతరంగాల మధ్య ఏదో సంబంధం ఉంటుందనే ఆ సంఘటన నుంచి ఈ కథ పుట్టింది. మనసుతో నక్షత్రాల్ని చంద్రుడిని, ఎలక్ట్రాన్స్, ప్రోట్రాన్స్ ఎలా ఎన్నో చూస్తున్నాం. అలాంటి మనసును చూడగలిగితే, కొలవగలిగితే ఏం జరుగుతుందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రయోగాత్మక కథాంశంతో ఈ సినిమా చేశాం అని తెలిపారు.
తాము నిర్మిస్తున్న మొదటి సినిమా వేడుకకు రామ్‌చరణ్ అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నామని, వైవిధ్యమైన ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ పేర్కొన్నారు. చరణ్ చదివిన పాఠశాలలోనే తాను చదువుకున్నానని, కష్టపడి నిర్మాతలు ఈ సినిమా చేశారని రజత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలేఖ, పరుచూరి గోపాలకృష్ణ, థామస్‌రెడ్డి ఆదూరి తదితరులు పాల్గొన్నారు.