Significance and Importance of “Bakrid Festival” Eid al Adha Vizagvision..
త్యాగాల పండుగ – బక్రీద్
ముస్లిం పండుగలలో రంజాన్, బక్రీద్ ముఖ్యమైనవి.
రంజాన్ అంటే ముస్లింలు హలీమ్ వంటి రకరకాల వంటకాలు చేసుకుని తినేది.
‘బక్రీద్’ అంటే మేకలనూ, గొర్రెలనూ, అవులనూ బలిచ్చి బిర్యానీలు పంచే పండుగన్నది చాలా మంది భావన!
ఈ బావన నిజం కాదు .
రంజాన్ ఎదుటి వారి ఆకలిని తెలుసుకునేలా చేసే ఉపవాస దీక్షతో మొదలై దాన ధర్మాలతో
సర్వమానవాలి ఒక్కటే అనే భావన కలగజేస్తే… బక్రీద్ త్యాగాన్ని తెలియజేస్తుంది .
నిజానికి ‘బక్రీద్’ పండుగ అసలు పేరు- ‘ఈదుల్ అజ్ హ’ అంటే – ‘త్యాగాల పండుగ. అలాగే ఈ పండుగకు ముందు వచ్చే రంజాన్ పండుగ అసలు పేరు ‘ఈదుల్ ఫిత్ర్’ అంటే- ‘దానాల పండుగ (Festival of charity)’. అని అర్థం…..
ఈ విధంగా ఇస్లాం నిర్దేశించే పండుగల్లో ఒకటి ‘దానాలు విస్తృతంగా చేస్తూ చేసుకునే పండుగ అయితే… త్యాగం చేస్తూ జరుపుకునే పండుగ మరొకటి.
ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగలో బీదలను, మీ దగ్గరి బంధువులను, మీ ఇరుగుపొరుగువారిని కూడా మీ సంతోషంలో భాగస్వాములుగా చేసుకుని పండుగ చేసుకోవలసిందిగా ఇస్లాం ఆజ్ఞాపిస్తుంది.
అందుకే ‘దానం’ – ‘త్యాగం’ అనే రెండు మహత్తరమైన గుణాలను ప్రతీ వ్యక్తి ప్రవృత్తిలో పెంపొందింపజేయటానికి ఒక పండుగను ‘దానాల పండుగ (Festival of charity)’ అని… ఇంకొక పండుగను ‘త్యాగాల పండుగ (Festival of sacrifice)’ అని నిర్దేశించటం జరిగింది.
ఏమిటీ త్యాగాల పండుగ
సంక్షిప్తంగా ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవ మార్గంలో చేసిన బలికి గుర్తు (Symbol) గా దైవ మార్గంలో ఒక గొర్రెనో, మేకనో, ఆవు లేక ఒంటెనో బలి ఇవ్వాల్సిందిగా నిర్దేశించటం జరిగింది. దానికి కారణం పై జంతువులలో వేటినో ఒక దానిని బలిచ్చి ఎవరికి వారు వండుకు తినటానికి కాదు. అసలు కారణం- ఆ బలి ఇవ్వగా వచ్చిన మాంసంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బీదలకు పంచాలి తద్వారా ఎందరో ఆకలితో అలమటించే బీదలకు ఆహారం లభిస్తుంది. మరొక భాగం బంధువులు దగ్గర వారికి దానం చేసి మిగిలిన ఒక భాగం స్వయంగా తినటం కోసం అన్న ఉద్దేశంతో మాత్రమే!
ఈ విధంగా సమాజంలో బీదలు, బంధువులు, ఇరుగుపొరుగు వారికీ జంతువును బలి ఇచ్చిన జంతు మాంసం నుండి మూడొంతుల్లో రెండొంతులు ఇవ్వటం అన్న ప్రక్రియ ద్వారా త్యాగనిరతిని అలవర్చటం అన్నది వాస్తవానికి ఈ బక్రీద్ పండుగ మౌలిక లక్ష్యం.
అసలు బలి ఇవ్వాల్సింది ఏమిటి?
ధర్మంలో ప్రార్ధన, ఉపవాసం, జంతు బలి ఇవ్వటం వగైరా క్రతువులు ఏదో పుణ్యం కొద్దీ చెసుకుపోవటానికి కాదు కానీ, వాటి ఆచరణ ద్వారా ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించి.. మంచిపనులు చేసే ప్రవృత్తిని జనింపజేయటమే!
ధర్మంలో సదాచారణ ‘గమ్యం’ అయితే క్రతువులన్నీ గమనాలు అవుతాయి అంటే గమ్యాన్ని చేర్చే సాధనాలవుతాయి. దైవమార్గంలో చేసే ఆరాధనలైనా, బలిదానాలైనా స్వీకరించబడాలంటే… సదాచారణ బాగుండాలి. అది లేనప్పుడు ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని బలిదానాలు ఇచ్చినా.. మరెన్ని క్రతువులు నిర్వర్తించినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి.
అదే విధంగా బక్రీద్ రోజు జంతు ‘బలి దానం’ ఇవ్వటం అన్న క్రతువుతో ‘ఖుర్బానీ’ (త్యాగం) అన్నది పూర్తి అయిపోదు. నిజానికి అసలు చేయవలసిన ఖుర్బానీ (త్యాగాలు) ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో చదవగలరు
“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (దైవ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు” – 3:96
అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చెయ్యటం? అంటే…
అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యటం…
అమితంగా ప్రేమించే వస్తువులను త్యాగం చెయ్యటం…
అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాలను త్యాగం చెయ్యటం…
ఇతరుల పట్ల ఉండే ఈర్ష్యా-ధ్వేషాలను త్యాగం చెయ్యటం…
అన్నిటికి మించి బలహీనతలను త్యాగం చెయ్యటం..
చెడు కోరికలను త్యాగం చెయ్యటం…
కాబట్టి బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వటం అన్నది కేవలం ఒక ప్రవక్త ఇబ్రహీం (అలై) బలికి ఒక ‘గుర్తు (Symbol)’ గా నిర్వర్తించే క్రతువు అయితే… దాని అసలు ఉద్దేశం అమితంగా ప్రేమించే వాటిని… బలహీనతలను, చెడు కోరికలను బలి ఇవ్వటం అన్న త్యాగనిరతిని వ్యక్తిత్వంలో జనింపజేయటమే.
బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ ముస్లిం సోదరులందరికీ Vizagvision బక్రీద్ శుభాకాంక్షలు.