ఇసుక రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు వారి కుటుంబాల ప్రయోజనార్థం ఇసుక రీచ్ లు కేటాయించాలని, ఆ నిర్ణయాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి అప్పల మాధవ రావు (అయ్యప్ప) డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ రంగం పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న వందలాది కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయాలు అగమ్యగోచరంకి గురి చేస్తున్నాయని వాపోయారు. ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరగకపోగా, ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం మరింత నిరాశాజనకంగా మారిందన్నారు. ఈ విధానం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోయామని తెలిపారు. మైనింగ్, విజిలెన్స్, పోలీస్ శాఖల దాడుల వల్ల దాదాపు 650 వాహనాలు సీజ్ కాగా రెండు లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి వచ్చిందన్నారు. తాజా పరిస్థితుల వల్ల ఇసుక రవాణా చేస్తున్న సుమారు మూడు వేల వరకు లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కనీసం రెండు ఇసుక రీచ్ (ర్యాన్ప్)కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇసుక ధరను నిర్ణయించి ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడం వల్ల భవన నిర్మాణ రంగం పైన, ఆయా కార్మికుల పైన ప్రతికూల ప్రభావం పడుతున్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించాలని అప్పల మాధవరావు అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి కే. రమణ (వెంకట్), కోశాధికారి పిల్ల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు గోవిందరావు, బంక శ్రీనివాసు, మద్దెల గురు నాయుడు, పొట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.