తిరుమల శ్రీవారి దర్శనార్థం 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన రాష్ట్రపతి దంపతులు శనివారం రాత్రి తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.
ఆదివారం ఉదయం మొదట క్షేత్ర సాంప్రదాయాల ప్రకారం శ్రీవారి దర్శనానికి ముందుగా వరాహస్వామి దర్శనానికి ఉదయం 5.50 గం. విచ్చేసిన భారత దేశ ప్రధమ పౌరుడు మరియు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులకు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహ్మన్ దంపతులు, టిటిడి చైర్మన్ వై వీ.సుబ్బారెడ్డి, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికి వరాహ స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు.
వరాహస్వామి దర్శనానంతరం ఉదయం 6.20 గం.కు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన రాష్ట్రపతికి మహద్వారం వద్ద టిటిడి ప్రత్యేకాధికారి ధర్మా రెడి, అర్చక స్వాములు ఇస్తాకా ఫల్ స్వాగతం పలికారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచన అనంతరం తీర్థ ప్రసాదాలను ఈఓ రాష్ట్రపతి దంపతులకు అందజేశారు.
రాష్ట్రపతి, గవర్నర్ దంపతుల వెంట డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎంపి విజయసాయి రెడ్డి, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి సబ్ కలెక్టర్ డా. మహేశ్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బురాజన్, ఇతర సంబందిత అధికారులు ఉన్నారు.