అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు.
కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్అండ్టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పరిశీలించారు.
మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు.
దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా
ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధికి సూచించారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని సమావేశంలో అత్యధికులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.
కాంక్రీట్ విగ్రహం కంటే ఇది 30 శాతం ఎక్కువ ఖర్చు అవుతుందని, కానీ, దీర్ఘకాలం మన్నికలో ఉంటుందని అధికారులు వివరించారు.
విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవుతుందని, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
విగ్రహం లోపలిభాగంలో పైవరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు.
ప్రాజెక్టులో భాగంగా వాటర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయరును అభివృద్ధి చేస్తారు. ఆడిటోరియమ్, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ ధియెటర్, ఆహ్లాదాన్ని అందించే రైలు వంటి సదుపాయాలను ఏర్పాటుచేస్తారు.
అక్కడే స్టార్ హోటల్, షాపింగ్ సెంటర్లు, రెస్టరెంట్, రిసార్టులు నెలకొల్పుతారు. ఇంతవరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తయిన విగ్రహంగా ఉందని,
ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో దాన్ని మించిపోనుందని అధికారులు చెప్పారు.
కొండపై ఏర్పాటు చేసే విగ్రహం కనుక ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు వాటికి మించిన ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
46 మాసాలలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని నిర్మాణదారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నీరుకొండను ద్వీపం తరహాలో అభివృద్ధి చేయాలని,
విగ్రహం కోసం 14 ఎకరాలు, రిజర్వాయర్ అభివృద్ధికి మరో 70, 80 ఎకరాలే కాకుండా మొత్తం 200 ఎకరాలలో ఆ ప్రాంతం మొత్తాన్ని గొప్ప పర్యాటక ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశంలో పురపాలక మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
















