రివ్యూ : సవ్యసాచి
తారాగణం : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్
మ్యూజిక్ : కీరవాణి
నిర్మాతలు : మైత్రీ మూవీస్
దర్శకత్వం : చందు మొండేటి
రిలీజ్ డేట్ : 02.11.18
చందు మొండేటి… ఫస్ట్ మూవీ కార్తికేయతో ఆకట్టుకున్న దర్శకుడు. తర్వాత మళయాల ప్రేమమ్ ను తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. కొత్త కంటెంట్స్ అంటేనే ఇష్టం అని చెప్పుకునే చందు ఈ సారి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ తో వచ్చాడు. పిండం ఎదుగుదల సరిగా లేక.. ట్విన్స్ గా పుట్టాల్సినవాళ్లు ఒకేశరీరంతో పుట్టడాన్ని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారు. ఇక ప్రేమమ్ తో చైతూకు సూపర్ హిట్ ఇచ్చాడు కాబట్టి.. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి వాటిని చందు అండ్ టీమ్ అందుకుందా లేదా అనేది చూద్దాం..
కథ :
విక్రమ్ ఆదిత్య(యాడ్ ఫిల్మ్ డైరెక్టర్). అతనికి పుట్టుకతోనే ఓ లక్షణం ఉంటుంది. ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ కారణంగా ఒకేశరీరంలో ఇద్దరు ఉంటారు. ఎడమ చేయి ఆధీనంలో ఆ రెండో వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. అందువల్ల ఆ చేయి ఒకలా ఇతను ఒకలా ప్రవర్తిస్తుంటారు. ఆదిత్య ఓ యాడ్ ఫిల్మ్ చేస్తోన్న టైమ్ లో చిత్ర( నిధి అగర్వాల్) ను చూసి గతంలోకి వెళతాడు. తను కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా తన నుంచి విడిపోయి.. ఆరేళ్ల తర్వాత మళ్లీ చూస్తాడు. ఆరేళ్ల తర్వాత ఓ యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో భాగంగా ఇద్దరూ యూఎస్ వెళతారు. అక్కడ అపార్థాలు తొలగిపోయి మళ్లీ వీరు తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకుంటారు. అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియాకు వచ్చిన ఆదిత్యకు గట్టి షాక్ తగులుతుంది. తను వచ్చేసరికి ఆ ఇళ్లు సిలిండర్ పేలడం వల్ల కూలిపోయి ఉంటుంది. ఇంట్లో ఆదిత్య అక్కా బావ, మేనకోడలు ఉంటారు. అక్క తప్ప ఆ ఇద్దరూ చనిపోయారు అని చెబుతారు చుట్టుపక్కల వాళ్లు. ఇదంతా ఎలా జరిగింది అనుకుంటోన్న టైమ్ లో అతని మేనకోడలు బ్రతికే ఉందని తెలుస్తుంది. అంతే కాదు.. ఆ ఇళ్లు గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల కూలిపోలేదని ఓ అజ్ఙాతవ్యక్తి బాంబ్ తో పేల్చివేసినట్టు.. అతని టార్గెట్ తనను చంపడమే అని తెలుసుకుంటాడు ఆదిత్య. మరి అతనెవరు..? ఎందుకు ఆదిత్య కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు..? ఆదిత్య ఆ అజ్ఞాతవ్యక్తిని ఎలా కనిపెట్టాడు..? మేనకోడలిని ఎలా రక్షించుకున్నాడు..? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆసక్తిని కలిగిస్తాయి. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు కావొచ్చు.. లేదా ఆ కాంబినేషన్ కావొచ్చు. సవ్యసాచి విషయంలో ఈ రెండూ ఉణ్నాయి. ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ వేసిన చందు మొండేటి తర్వాత నాగచైతన్యతో ప్రేమమ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అంటే దర్శకుడుతో పాటు కాంబినేషన్ కూడా ఈ మూవీపై ఆసక్తి పెంచింది. కానీ ఆ ఆసక్తి చచ్చిపోవడానికి ఆట్టే టైమ్ తీసుకోలేదు దర్శకుడు. యస్.. ఆశ్చర్యంగా ఉన్నా.. సవ్యసాచి అంచనాలను అందుకోవడం మాట అటుంచితే.. అసలు అర్థరహితమైన కథ, కథనాలతో విపరీతంగా బోర్ కొట్టిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ అరె.. ఈ దర్శకుడేనా కార్తికేయ వంటి బ్రిలియంట్ మూవీ తీసింది అనిపించకమానదు. కార్తికేయలో ‘యానిమల్ హిప్నాటిజం’ అనే కాన్సెప్ట్ ను అద్భుతంగా డీల్ చేసిన చందు..ఈ సారి కూడా అందుకు ఎంతో ఆస్కారం ఉన్న ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’అనే కొత్త కాన్సప్ట్ తోనే వచ్చాడు. కానీ ఈ కాన్సప్ట్ ను ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంలో ప్రతి ఫ్రేమ్ లోనూ కన్ఫ్యూజ్ అయ్యాడు. దీంతో ఈ కాన్సెప్ట్ ను ఎలివేట్ చేయాలా.. తను రాసుకున్న కథను ఎలివేట్ చేయాలా అనే అయోమయంలో అంతా అలా వదిలేశాడు. దీనివల్ల ఏ సీన్ కూడా సరిగా పండలేదు. కామెడీ పేరుతో చేసిన ‘చెంపదెబ్బల’ ప్రహసనం అపహాస్యం అయింది. కాకపోతే యూఎస్ లో షకలక శంకర్, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే సీన్స్ కాస్త నవ్విస్తాయి. అంతే తప్ప ఈ సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు.
అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనం. ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని ప్రేమకథ. ఒకే శరీరం పంచుకుపుట్టిన కవలలు అనే కాన్సెప్ట్ ను ఏ మాత్రం జనరంజకంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. అసలు కార్తికేయ తీసిన దర్శకుడేనాఈ సినిమాను తెరకెక్కించింది అని ఆల్మోస్ట్ సినిమా మొదలైన పావుగంట నుంచి ప్రతి సీన్ కూ అనిపిస్తుంది. అంత పేలవంగా ఉంది కథనం. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనే విషయంలో అస్సలు క్లారిటీ చూపించలేకపోయాడు. దీనివల్ల ఈ కథను ఎలా తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయిన ఆడియన్ పేషెన్సీకి టెస్ట్ పెట్టినట్టైంది.
సింపుల్ గా చెబితే ఇది రొటీన్ రివెంజ్ డ్రామా. కాకపోతే ఈ రివెంజ్ ఈ సారి విలన్ ది. దాని వెనక ఏమైనా బలమైన పాయింట్ ఉందా అంటే లేదు. హీరో విలన్ మధ్య గేమ్ చూస్తే.. ఈ మధ్యే వచ్చిన ధృవ వంటి సినిమాలతో పాటు ఎప్పుడో వచ్చిన చాలా మూవీస్ గుర్తొస్తాయి. దీంతో హీరోను పరుగెత్తించే విలన్ ను, అతను చెప్పినట్టల్లా పరుగులు తీసే హీరోను చూస్తే జాలి కలుగుతుంది. హీరోయిన్ పరిస్థితీ అంతే. సినిమాకు ఈ ఇద్దరే మెయిన్ కాబట్టి.. వీళ్లే ప్రేమలో పడాలి. అందుకు వీళ్ల మధ్య చిన్న గొడవతో పరిచయం మొదలుకావాలి.. హీరో కాబట్టి రాగింగ్ చేసినా ఫర్వాలేదు. అవతలివాడు చేస్తే అది పాపం.. దీనికో రొటీన్ లెక్చర్ ఫైట్. అంతే హీరోయిన్ పడిపోతుంది. ఇంత పేలవంగా మొదలైన ఈ ప్రేమకథకు పాటలు దారుణంగా మారాయి. అసలు కీరవాణి సంగీతం అంటే ఏ కోశానా నమ్మబుద్ధి కాదు. ముఖ్యంగా ‘నిన్నురోడ్డు మీద చూసినట్టు’ పాట రీమిక్స్ చూస్తే చాలు.. ఇది కీరవాణి సంగీతం కాదు అని డౌట్ పడటానికి. ఆశ్చర్యంగా అతని ఆర్ఆర్ కూడా అత్యంత దారుణంగా ఉంది. సన్నివేశానికి ఏ మాత్రం సంబంధం లేని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల బోర్ ను పెంచడానికి తనవంతుగా విపరీతమైన కృషి చేశాడు కీరవాణి. పాపం ఆయన ఈ సినిమా కోసం బాహుబలికి పెట్టినంత ఎఫర్ట్ పెట్టారని ఆ మధ్య కొందరు జోక్స్ కూడా చేశారు.
మొత్తంగా ఫస్ట్ మూవీ కార్తికేయలో ‘యానిమల్ హిప్నాటిజం’ అనే కాన్సెప్ట్ తో మెస్మరైజ్ చేసిన దర్శకుడు చందు మొండేటి.. ఈ సారి ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులు అనే సైంటిఫిక్ కాన్సెప్ట్ నే తీసుకున్నా.. అస్సలే మాత్రం మెప్పించలేకపోయాడు. ఇంకా చెబితే సెకండ్ హాఫ్ లో ఎన్నో సీన్స్ అతని వద్ద విషయం(ఈ సినిమాకు సంబంధించి) లేదు అన్న విషయం తెలియజేస్తాయి. కామెడీ కోసం అని ‘డ్రామా’ సీన్స్ పెట్టారు కానీ.. నిజానికి అవి ఆడియన్ పాలిట ట్రాజెడీ సీన్స్.
ఆర్టిస్ట్ ల పరంగా నాగచైతన్య బాగానే చేశాడు. కానీ అతని పాత్ర ఏం చేయాలనుకుందన్న క్లారిటీ దర్శకుడికి లేకపోవడంతో అతని ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యాయి. హీరోయిన్ నిధి బావుంది. కాకపోతే తన పాత్రకూ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. వెన్నెల కిశోర్, సత్య నవ్వించే ప్రయత్నం చేశాడు. భూమిక ప్లేస్ లో ఎవరున్నా ఏం నష్టం లేదు అన్నట్టుగా ఉంటుందా పాత్ర. అసలే మాత్రం తనదైన ముద్ర చూపడానికి వీలు లేని ఈ పాత్ర కేవలం తన సినిమాల నంబర్ ను పెంచుతుంది తప్ప.. భూమిక కెరీర్ కు ఏ మాత్రం మైలేజ్ కాదు.. ఇక అన్నిటికంటే ఆశ్చర్యం.. సినిమాల్లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు కానీ.. కంటెంట్ లేని సినిమాలు చేయడు అన్న పేరున్న మాధవన్ ఈ పాత్రకు ఒప్పుకోవడం.. పాపం అతని పాత్రకు పూర్తిగా అన్యాయం జరిగింది. కథే సరిగా లేని ఈ సినిమాలో ఎన్ని పాత్రలుంటే ఏం ఉపయోగం ఏముంటుంది. ఇక మాధవన్ తెరపై కనిపిస్తున్నంత సేపూ.. అతను ఏం నచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నాడా అని పదిసార్లైనా అనుకుంటారు. అలా ఉంది అతని పాత్ర..
టెక్నికల్ గా :
కీరవాణి సంగీతం వందశాతం మైనస్ గా మారింది. చివరికి తన పాత పాటను రీమిక్స్ చేయడంలోనూ ఏ మ్యాజిక్ చేయలేకపోయాడు. ఆర్ఆర్ మరీ దారుణంగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేయొచ్చు. ముఖ్యంగా కథ సీరియస్ గా వెళుతుందేమో అనుకునే టైమ్ లో సడెన్ గా కాలేజ్ డ్రామా పెట్టడం దర్శకుడి విషయలేమికి నిదర్శనం.. ఇది అసలు అవసరమే లేదు. మాటలు మామూలుగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఆకట్టుకోదు. మైత్రీ మూవీస్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నా.. వారికి ఇది ఫస్ట్ డిజాస్టర్ అని చెప్పక తప్పదు.
ప్లస్ పాయింట్స్ :
వెన్నెల కిశోర్, షకలక శంకర్ కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
మిగతా అన్నీ
ఫైనల్ గా : రెండు చేతులా నిరాశపరిచిన సినిమా
రేటింగ్ : 1.5/5
– యశ్వంత్. కె