రెండవ CISF వందేమాతరం పోస్టల్ సైక్లోథాన్ సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ అడిషనల్ డీజీపీ బినీత ఠాకూర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సైక్లోథాన్ బృందం అద్భుతమైన పనితీరును కనబర్చిందని, వారి సేవల పట్ల గర్వంగా ఉందని ఆయన తెలిపారు.
దేశభక్తి, ప్రజల భాగస్వామ్యం మరియు తీరప్రాంత భద్రత పట్ల CISF అచంచలమైన నిబద్ధతకు ఈ సైక్లోథాన్ నిదర్శనమని పేర్కొన్నారు. జనవరి 28న గౌరవనీయులైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు ప్రారంభించిన ఈ సైక్లోథాన్, భారతదేశ తీరప్రాంతం వెంబడి వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఒక శక్తివంతమైన జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ సందర్భంగా CISF సైక్లిస్టులు సముద్ర భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు తీరప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుస్తున్నారని చెప్పారు.
1969లో స్వల్పంగా ప్రారంభమైన CISF నేడు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఓడరేవులు, మెట్రోలు మరియు ఇతర కీలక మౌలిక వసతులతో సహా 351 ముఖ్యమైన సంస్థలకు రక్షణ కల్పిస్తూ, రెండు లక్షలకు పైగా సిబ్బందితో ఒక అగ్రగామి బలగంగా ఎదిగిందని వివరించారు. ఈ కీలక ఆస్తుల రక్షణ ద్వారా దేశ ఆర్థిక బలాన్ని మరియు జాతీయ ఆత్మవిశ్వాసాన్ని CISF కాపాడుతోందని అన్నారు.
భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం పరిమాణం ఓడరేవుల ద్వారానే జరుగుతుండటంతో, తీరప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. సురక్షితమైన తీరప్రాంతం అంటే సురక్షితమైన మరియు సంపన్నమైన భారతదేశమని పేర్కొన్నారు. ఈ సైక్లోథాన్ ద్వారా మత్స్యకారులు, విద్యార్థులు, యువత మరియు స్థానిక సంఘాలతో మమేకమై భద్రత అనేది అందరి ఉమ్మడి బాధ్యత అన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
దేశ నిర్మాణంలో సమగ్ర వృద్ధి కీలకమని, మహిళా సాధికారత కేవలం సామాజిక లక్ష్యం మాత్రమే కాకుండా జాతీయ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం మరియు ప్రాతినిధ్యం లభించినప్పుడు దేశం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని అన్నారు.
ఈ సైక్లోథాన్ బృందంలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని పేర్కొంటూ, 2026 చివరి నాటికి CISF దళంలో 10 శాతం మహిళా ప్రాతినిధ్యం సాధించే ఏకైక CISFగా నిలవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది భద్రతా దళాల్లో లింగ సమానత్వానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
సంరక్షిక (Sanrakshika) కార్యక్రమం ద్వారా CISF తన సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, ఈ సైక్లోథాన్కు మద్దతుగా సంరక్షిక నుంచి అధికారుల కుటుంబ సభ్యులు హాజరుకావడం సంతోషకరమని తెలిపారు.
ఈ సైక్లోథాన్ ఫిబ్రవరి 22న కొచ్చిలో ముగియనుందని, మిగిలిన ప్రయాణానికి సైక్లిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. తీరప్రాంతం మరియు దేశ భద్రత కోసం అందరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.



















