4 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన



కేంద్ర పోర్టులు, నౌకాశ్రయాలు మరియు జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ శనివారం సాలిగ్రాంపురం లోని సాగరమాల కన్వెన్షన్స్‌లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
భద్రత, మౌలిక సదుపాయాలు, పరిపాలన మరియు నివాస సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఇందులో ₹52.23 కోట్ల వ్యయంతో ఎల్పీజీ బెర్త్ లో అగ్నిమాపక సదుపాయాల అభివృద్ధి, ₹35.87 కోట్లతో ఓఆర్ఎస్ డ్రైడాక్ ఆధునికీకరణ (నౌకల మరమ్మత్తులు, ఆదాయ సృష్టి కోసం), గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ₹97.70 కోట్ల వ్యయంతో జీ+9 అంతస్తుల డా. బి.ఆర్. అంబేద్కర్ పరిపాలనా భవనం నిర్మాణం, అలాగే ₹44.20 కోట్లతో హార్బర్ పార్క్‌లో నివాస అపార్ట్మెంట్ల నిర్మాణం ఉన్నాయి.
అతిథులను స్వాగతిస్తూ, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథుల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పోర్ట్ అధికారులు మరియు ఉద్యోగుల పని, నివాస పరిస్థితులు మెరుగుపడేలా ఆధునిక పరిపాలనా కార్యాలయ భవనం మరియు నివాస సముదాయం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం అందమైన నగరమని, రాబోయే కాలంలో ప్రధాన నగరంగా మరియు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నగరం చుట్టుపక్కల వేగంగా పరిశ్రమలు స్థాపించబడుతున్నాయని ఆయన అన్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు, సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ యాజమాన్యాన్ని అభినందించారు. సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా పేదలకి అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
షిప్పింగ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, పోర్టుల రంగానికి సంబంధించిన లక్ష్యాలు మారిటైమ్ ఇండియా విజన్ మరియు అమృత్ కాల్ విజన్ అనే రెండు ముఖ్య పత్రాలలో స్పష్టంగా పొందుపరచబడ్డాయని తెలిపారు. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట కాలవ్యవధిలో సాధించాలని పేర్కొన్నారు. కార్గో పరిమాణం పెంపుతో పాటు భద్రత కూడా అత్యంత ముఖ్యమని, ఇందుకోసం పీపీపీ మరియు బీఓటీ ఆపరేటర్లు సహా అన్ని స్టేక్హోల్డర్లతో సమన్వయం అవసరమని తెలిపారు.
విశాఖపట్నం నగర అభివృద్ధిలో విశాఖపట్నం పోర్ట్ ఎప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అన్నారు. పోర్ట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టులు నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజల ప్రయోజనార్థం అమలు చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గౌరవ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, పోర్ట్ అభివృద్ధికి మద్దతు అందిస్తున్న విశాఖ ప్రజలను అభినందించారు. రాబోయే సంవత్సరాల్లో విశాఖపట్నం పోర్ట్ 100 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) కార్గో నిర్వహణను అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పోర్ట్ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పోర్టులలో ఒకటిగా, ప్రపంచంలోని టాప్ 100 పోర్టులలో స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రధాని గారి దృష్టికి అనుగుణంగా సముద్రరంగ అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిధులతో శిక్షణ పొందిన సిఇఎంఎస్ విద్యార్థులకు కోర్సు పూర్తి ధ్రువపత్రాలు మరియు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, సిఇఎంఎస్ మరియు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (IMU) విద్యార్థులు కూడా హాజరయ్యారు.
















