బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025 లో జివిఎంసి.వాతావరణ స్థితిస్థాపకత కోసం వార్డు 19 లో V-PULL (విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) వేదిక ద్వారా ప్రజల ఆలోచనలకు ఆహ్వానం.

– జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం నగర పాలక సంస్థ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025 లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాలలో ఒకటిగా నిలిచిందని, పట్టణ సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొనడంలో అంతర్జాతీయ గుర్తింపుగా ఈ గౌరవం లభించిందని,ఈ కార్యక్రమంలో భాగంగా, జివిఎంసి వైజాగ్–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్ (V-PULL) మోడల్‌ను పరీక్షిస్తూ, వార్డు 19 లో శివ గణేష్ నగర్లో వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ప్రజల ఆలోచనలు, సూచనలను ఆహ్వానించడం అయినదని బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ “99 దేశాల నుండి 600 కంటే ఎక్కువ నగరాల మధ్య, బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025 ఫైనలిస్ట్‌గా విశాఖ ఎంపిక కావడం విశాఖ నగరానికి గర్వకారణమన్నారు. ఇది ప్రజా-కేంద్రీకృత మరియు వినూత్నమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో జివిఎంసి కట్టుబాటును ప్రతిబింబిస్తుందన్నారు.
V-PULL వేదిక ద్వారా ప్రజలు, సంస్థలు, సాంకేతిక నిపుణులు కలిసి కో – క్రియేషన్ పద్ధతిలో పరిష్కారాలు కనుగొనేందుకు ఒక వేదికగా పనిచేస్తుందన్నారు. గతంలో వార్డు 41లో నిర్వహించిన కో- క్రియేటివ్ వర్క్‌షాప్‌లు చిన్నవయినప్పటికీ ప్రభావవంతమైన పరిష్కారాలను అందించాయన్నారు. ఆ అనుభవంతో, ఇప్పుడు మేము ఈ ప్రోటోటైప్‌ను వార్డు 19కి విస్తరించి, ముఖ్యంగా వరదలు, తుఫానులు, ఉష్ణ తరంగాలతో అధికంగా ప్రభావితమయ్యే మత్స్యకార కుటుంబాల సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.
ప్రతి పౌరుడు ముందుకు వచ్చి తమ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని,.ప్రతి ఆలోచన విలువైనదేనని, సమిష్టి జ్ఞానం, చర్యల ద్వారా బలహీన వర్గాలను రక్షించి, మరింత బలమైన, సురక్షితమైన, స్థితిస్థాపకమైన విశాఖపట్నం నిర్మించవచ్చునని కమిషనర్ తెలిపారు .
జివిఎంసి అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా ప్రచార పోస్టర్లో ఇచ్చిన QR కోడ్ ద్వారా ప్రజలు భాగస్వామ్యంతో ఆలోచనలను, సూచనలను పంచుకొని సహకరించాలన్నారు.
సెప్టెంబర్ నెలలో వార్డు 19లో జివిఎంసి కో క్రియేటివ్ వర్క్‌షాప్‌లు నిర్వహించనుందని,.వాటిలో ప్రజలు, వార్డు సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు కలిసి సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను రూపుదిద్దుతారన్నారు. సంబంధిత వివరాల కోసం స్థానిక వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చునని, యువత, సంఘాలు, NGOలు, వ్యాపార, విద్యాసంస్థలు సహా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి విశాఖ భవిష్యత్తు స్థితిస్థాపకతను నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ కోరుకుంటుందని కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో జీవీఎంసీ ఎస్ ఆర్ యు ప్రతినిధి స్వప్న, వి- పుల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇమ్మానుయేల్, జూనియర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.















