కెప్టెన్ ఆషు అద్భుత రైడింగ్‌తో దబాంగ్ ఢిల్లీ బోణీ
41–34 తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపు
15 పాయింట్లతో అదరగొట్టిన ఆషు మాలిక్
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఘన విజయంతో శుభారంభం చేసింది. కెప్టెన్ ఆషు మాలిక్ (15 పాయింట్లు) అద్భుత రైడింగ్‌తో ముందుండి నడిపించడంతో వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 41–34 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఢిల్లీ జట్టులో ఆషుతో పాటు నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు) సత్తా చాటాడు. ఈ పోరులో ఢిల్లీ.. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసింది. చివర్లో పుంజుకున్న బెంగళూరు ఢిల్లీని ఒకసారి ఆలౌట్ చేసినా వరుసగా రెండో ఓటమి తప్పించుకోలేపోయింది. ఆ జట్టు తరఫున ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయియన్ (10) సూపర్ టెన్, రైడర్ ఆశీష్ మాలిక్ (8) పోరాడినా ఫలితం లేకపోయింది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌తో యు ముంబా పోటీ పడనుంది.




మ్యాచ్ ప్రారంభం నుంచే దబాంగ్ ఢిల్లీ జట్టు దూకుడుగా, వ్యూహాత్మకంగా ఆడింది. కెప్టెన్ ఆషు మాలిక్ మెరుపు రైడింగ్‌లతో బెంగళూరు డిఫెన్స్‌ను పూర్తిగా గందరగోళానికి గురిచేశాడు. ఆట మొదలైన కేవలం ఏడు నిమిషాల్లోనే బెంగళూరు బుల్స్‌ను ఆలౌట్ చేసి తమ జట్టును10-–3తో ఆధిక్యంలోకి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో ఆషు చేసిన సూపర్ రైడ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకే రైడ్‌లో ముగ్గురు ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసి, తన అసాధారణ ప్రతిభను చాటాడు. ఇంకోవైపు ఢిల్లీ డిఫెన్స్‌కు ‘సుల్తాన్’ ఫజల్ అత్రాచలి నాయకత్వం వహించాడు. బెంగళూరు ప్రధాన రైడర్ ఆకాష్ షిండే రైడింగ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేసినా.. అతని అవకాశాలను ఫజల్ అడ్డుకున్నాడు. ఒక దశలో షిండే భుజాలను పట్టుకొని, అతడిని మిడ్లైన్ దాటకుండా ఆపి ఔరా అనిపించాడు. మరోవైపు, బెంగళూరు బుల్స్ ఆటగాళ్లు సెల్ఫ్ ఔట్ అవ్వడం వంటి పొరపాట్లు చేసి మరింత వెనుకబడిపోయారు. బుల్స్ ఆటగాళ్లు ఆశీష్ మాలిక్, అలిరేజా మిర్జాయియన్ కాస్త పోరాడినా.. మొదటి సగం ముగిసే సమయానికి ఢిల్లీ 21–-11తో పది పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలి భాగంలో దబాంగ్ జట్టు 13 రైడ్, 5 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టింది.
రెండో అర్ధభాగంలోనూ ఢిల్లీ హవానే నడిచింది. ఆషు తన ధాటిని కొనసాగించగా.. డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో ఐదు నిమిషాల్లోనే బెంగళూరును మరోసారి ఆలౌట్ చేసిన దబాంగ్ 28–13తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అలీరెజా మిర్జాయియన్ లాంటి కీలక రైడర్లను కూడా ఢిల్లీ డిఫెండర్లు సులభంగా నిలువరించారు. మరోసారి ఆలౌట్ ప్రమాదంలో నిలిచిన దశలో ఆకాశ్ షిండే.. ఆషు మాలిక్‌ను సూపర్ టాకిల్ చేశాడు. ఇక్కడి నుంచి బుల్స్ వరుస పాయింట్లు సాధించింది. ఆషు ను మరోసారి సూపర్ ట్యాకిల్‌తో నిలువరించింది. కానీ, పాయింట్ల అంతరం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీని అందుకోలేకపోయింది. మరో ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా ఢిల్లీ స్కోరు 38–-22కు చేరుకుంది. చివర్లో అలీరెజా సక్సెస్ఫుల్ రైడ్స్‌తో పాటు బుల్స్ ఆటగాళ్లు చేసిన పోరాటంతో ఢిల్లీని ఆలౌట్ చేసినప్పటికీ ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
















