శాస్త్రోక్తంగా.. సద్యో‘ముక్తి’ ఉత్సవం త్రిశూలస్నానానికి అశేషంగా వచ్చిన భక్తజనం శ్రీకాళహస్తి,Vizagvision…సత్ అంటే.. తలిచిన వెంటనే ముక్తి కలిగే దివ్య క్షేత్రంగా శ్రీకాళహస్తి విరాజిల్లుతోంది. అందుకే ఇక్కడి దివ్యధామాన్ని.. సద్యోముక్తి క్షేత్రంగా పిలుస్తుంటారు. సువర్ణముఖినదీ తీరంలో నిర్వహించిన సద్యోముక్తి ఉత్సవం వైభవంగా జరిగింది.
చిన్న బ్రహ్మోత్సవంగా పిలిచే.. త్రిశూలస్నాన మహోత్సవం ఆద్యంతం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఏటా మాఘ పూర్ణిమ రోజున సువర్ణముఖి నదికి పుష్కరోత్సవం జరుపుతుంటారు.
ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం పంచమూర్తులైన శ్రీవినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, సోమస్కంధమూర్తి, జ్ఞానప్రసూనాంబిక, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయం నుంచి సువర్ణముఖీ నదీ తీరానికి తీసుకువచ్చారు. ఆలయ అనువంశీక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య సంకల్ప పూజలు ప్రారంభించారు. యాగకలశాన్ని ఏర్పాటు చేసి త్రిశూలంలో కొలువుదీరిన ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. ఇక్కడి క్షేత్రంలో నిర్వహించే సద్యోముక్తి వ్రత వైశిష్ట్యాన్ని ఆలయ వేదపండితులు శ్రీనివాసశర్మ భక్తులకు వివరించారు. పుష్కర సమయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి కొలువుదీరిన త్రిశూలాన్ని ఆలయ అర్చకులు నదీజలాల వద్దకు తీసుకువచ్చారు. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ అంటూ.. భక్తుల శివనామస్మరణల మధ్య త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధూప, దీప, నివేదనాది కైంకర్యాలు చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే , మరియు ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. చక్కటి పందిళ్లు వేయడం, చలమ కాస్తంత పెద్దదిగా ఏర్పాటు చేయడం.. త్రిశూలం వెళ్లే సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాటలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో చేపట్టిన చర్యలతో ఈ విశేషోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

















