పర్యాటక బోట్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం ఋషికొండ బీచ్ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక బోట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చిన సమయంలో పర్యాటక బోట్లకు అధికారులు జారీ చేసిన ఆదేశాలను బోట్ల యజమానులు పాటించాలన్నారు. పర్యాటకులు కూడా వరదలు సమయంలో బోట్లలో ప్రయాణించకూడదని ఆయన కోరారు. ఋషికొండలో 4 బోట్లు ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బోట్లకు అనుమతులు ఇచ్చేముందు ఫిట్ నెస్ చూస్తారని, ఇందులో బోట్ జీవిత కాలం, సరిగా ఉన్నదా లేదా, తదితర అంశాలను చూస్తారని, ఫిట్ నెస్ చూసేటప్పుడు ఏ విధమైన రికమండేషన్లకు తావులేదన్నారు. క్వాలటీ విషయంలో రాజీ లేదని తెలిపారు. పర్యాటక బోట్లు పై ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ తీసుకోవడమైనదని, ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేయడమైనదని వాటిని అమలుచేసే బాధ్యత స్థానిక అధికారుదేనని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూంల ద్వారా తహసిల్థారు స్థాయి అధికారులు చూస్తారని, వారు ఓకే అంటేనే బోటు తిరుగుతుందని పేర్కొన్నారు. బోట్లలో వెల్లేటప్పుడు పర్యాటకులు లైఫ్ జాకెట్స్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం, డ్యాన్స్ లు నిషేధించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తీర ప్రాంతం, అడవులు ఉన్నందు వలన పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తుందని, వ్యవసాయంతో పాటు పర్యాటక శాఖ ద్వారా ఆదాయం వచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, పర్యాటక శాఖ అధికారులు సుదర్శనరావు, పూర్ణిమదేవి, ప్రసాద రెడ్డి, సత్యనారాయణ, అశోక్, దాసు, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి, పార్లమెంటు సభ్యులు, తదితరులు బోటుపై సముద్రంలో పర్యటించారు

















