టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో టీడీపీ ముఖ్య నేతలు జరిపిన సమావేశం
ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు.
ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ఉనికిని ఎలా కాపాడుకోవాలో చర్చించామని తెలిపారు.
రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని విమర్శించారు.
రాష్ట్రానికి నష్టం చేసి పొరుగు రాష్ట్రాలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
రాజధానిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఐదు నెలల జగన్ పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికార, రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
మీడియాను అణిచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చిందని, ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తుతామన్నారు.
టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తామన్నారు.
మద్యం పాలసీని అంచెలంచెలుగా తీసుకొచ్చిన ప్రభుత్వం.. అర్ధాంతరంగా ఆంగ్లాన్ని తీసుకురావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
పార్లమెంట్ సాక్షిగా వైసీపీ పాలనను ఎండగడతామన్నారు.
రాజధానిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
అమరావతి భవిష్యత్తును తేల్చాలని కోరారు.
ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున త్యాగాలు చేశారని.. ఇప్పుడు వైసీపీ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదాను ఎన్నికల కోసమే వినియోగించుకున్నారని ఎద్దేశా చేశారు.
చిత్తశుద్ధి లేదని ఈ ఆరు నెలల్లో నిరూపితమైందని.. పార్లమెంట్ సమావేశాల్లో వీటిని ప్రస్తావిస్తామని రామ్మోహన్ అన్నారు

















