నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు.
అనంతరం శ్రీశైలం జలాశయం వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడి నుంచి సున్నిపెంట చేరుకుని వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు.
అనంతరం సున్నిపెంటలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి 35 నదులు ఉన్నాయి.
కృష్ణా నదిపై నాగార్జున సాగర్ తర్వాత శ్రీశైలం జలాశయం నిర్మితమైంది.
రాయలసీమలో నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి.
ఈ ప్రాంతానికి నీళ్లివ్వాలని మొదట నిర్ణయించింది ఎన్టీఆరే.
సమైక్యాంధ్రప్రదేశ్‌లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించా.
ఆంధ్రప్రదేశ్ రైతు రాష్ట్రంగా మారేందుకు అనేక చర్యలు చేపట్టాం.
ప్రతి ఒక్క రైతుకూ నీరిచ్చేంత వరకు నేను జలదీక్ష విరమించను.
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తిచేసి పంట భూములకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
అందరికీ నీటి భద్రత కల్పించి.. ఏపీ ధనిక రాష్ట్రంగా మారేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు.