మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో
విశాఖనగర మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రగతి నివేదిక
సోదర సోదరీమణులారా ! మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరంనకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్ గా నేను పదవిని చేపట్టిన నాటి నుండి నాతో పాటు 97 వార్డు కార్పొరేటర్లతో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ నగర ప్రజలకు అవసరమగు మౌళిక సదుపాయాలు కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుచున్నవని తెలియజేస్తున్నాను. 2025 లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలు మననం చేసుకుంటూ, లోపాలను సవరించుకొని 2026 లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకుని లక్ష్యసాధనకు సమిష్టిగా కృషి చేస్తామని తెలియపరుచుచున్నాము. విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నగరంలో అన్ని వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8 జోనులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 10 జోనులుగా అనగా భీమునిపట్నం జోన్, మధురవాడ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, పెందుర్తి జోన్, గాజువాక జోన్, అగనంపూడి జోన్, అనకాపల్లి జోనులుగా పునర్వ్యవస్థీకరణ చేస్తూ 1వ తేదీ జనవరి 2026 నుండి ఆయా జోనులలో కార్యకలాపాలు, సేవలు ప్రజలకు అందించడం జరుగునని తెలియపరచుచున్నాను.



జీవీఎంసీ అభివృద్ధి పనులలో భాగంగా 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 338.92 కోట్ల అంచనాలతో 1628 పనులను చేపట్టగా 1303 పనులను 221.22 కోట్లతో పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశలో ఉన్నవి. 2025-26 సంవత్సరంలో 657.39 కోట్ల అంచనాలతో 1667 పనులను చేపట్టగా 486 పనులను 82.75 కోట్లతో పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి.
యోగాంధ్ర 2025: భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలో విశాఖ వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 జూన్ 21న ఆర్కే బీచ్ ప్రాంతంలో యోగాంధ్ర పేరుతో ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగ అనే నేపథ్యం గా నిర్వహించిన కార్యక్రమం ప్రపంచ స్థాయి గుర్తింపుని పొంది విజయవంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అంతటా నెల రోజులపాటు ప్రజలు, యోగ ప్రియులు విరివిగా యోగా శిక్షణలో పాల్గొనగా ఒక్క విశాఖ నగరంలోనే 3 లక్షలకు పైగా యోగ దినోత్సవం నాడు ప్రజలు విశాఖ తీర ప్రాంతంలో పాల్గొనగా ప్రపంచ స్థాయి గుర్తింపుని విశాఖ దక్కించుకుంది. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహణకు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన పాత్ర పోషించిందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము.
భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII) సహకారంతో దేశీయ, ప్రపంచ పెట్టుబడుదారులకు ప్రాధాన్యత గల పెట్టుబడి గమ్యస్తానంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రదర్శించే లక్ష్యంతో 2025 నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మైదానం నందు భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం-2025 నిర్వహించింది. ఈ సమావేశానికి జీవీఎంసీ 64 కోట్ల 88 లక్షల అంచనా వ్యయంతో నగరంలో సుమారు 240 పనులు అనగా రోడ్లు, ఫుట్పాతులు, మ్యూరల్ ఆర్ట్స్, పెయింటింగు, పచ్చదనం, అందమైన మొక్కలు, ట్రాఫిక్ ఐలాండ్స్, జంక్షన్ల మెరుగుదలలు, నీటి ఫౌంటైన్లు మొదలగు సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టి సమావేశం విజయవంతం కావడానికి ప్రధాన భూమికగా నిలిచిందని తెలియజేస్తున్నాము.
యాన్యుటి రోడ్ల అభివృద్ధి: విశాఖ నగర అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు విశాఖ నగరంలో జీవీఎంసీ పి.పి.పి. – హెచ్.ఎ.ఎమ్ క్రింద 306.95 కోట్ల ఖర్చుతో 88.35 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిపాదించబడింది. ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరం నిర్మాణ కాలం మరియు 10 సంవత్సరాల ఓ & ఎమ్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కు ఏ పి యు ఐ ఏ ఎం ఎల్ అభివృద్ధి కాలంలో స్వతంత్ర ఇంజనీర్ కం ప్రాజెక్టు మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ గా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి పరిపాలన మంజూరుకు ప్రాజెక్టు ప్రతిపాదన ప్రక్రియలో ఉంది.
అలాగే విశాఖ నగరంలో ప్రజలకు, వాహనాల రాకపోకలకు, ప్రజా ఆరోగ్యానికి, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించే దిశగా జీవీఎంసీ కమిషనర్ వినూత్న ఆలోచనలతో ఆపరేషన్ లంగ్స్, ఈట్ రైట్ క్యాంపెయిన్ ద్వారా షీ టీమ్స్, పైలట్ ప్రాజెక్టుగా “ప్రాజెక్ట్ సారథి” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా AI ఆధారిత సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ఐటిఎంఎస్ సిస్టం కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగింది. ఆపరేషన్ లంగ్స్ ద్వారా నగరంలో గల లేఔట్ ఓపెన్ స్పేసెస్ లో పార్కు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా 17 ఆస్తులను కాపాడి, 330 ఆస్తులకు ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించడం జరిగింది. రోడ్లను, జంక్షన్లను, ఫుట్పాతులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న తాత్కాలిక దుకాణాలు ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 6240 ఆక్రమణలను తొలగించి ప్రజలకు, వాహనాల రాకపోకలకు, ట్రాఫిక్ నియంత్రణకు సులభతరం చేయడం జరిగింది.
ఈట్ రైట్ క్యాంపైన్ కింద 16 ప్రత్యేక (SHE Teams) టీమ్స్ ను ఏర్పాటు చేసి హోటల్లు, రెస్టారెంట్లలో ఆహార పరిశుభ్రత, ప్రమాణాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) వస్తువుల వినియోగంపై 1466 తనిఖీలు నిర్వహించి 1007 కేసులు నమోదు చేసి 7 లక్షల 7 వేల రూపాయలు జరిమానాలు విధించడమైనది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న దుకాణాలపై 2727 కేసులు నమోదు చేసి 13 లక్షల 26 వేలరూపాయలు, వ్యర్ధాలు బహిరంగంగా పడవేసిన 3,786 దుకాణాల పై 18 లక్షల 57 వేల రూపాయలు జరిమానా విధిస్తూ వారికి అవగాహన కల్పించమైనది.
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు: విశాఖ నగరంలో వీధివిక్రయదారుల కొరకు, ఎస్ హెచ్ జి మహిళల జీవనోపాధిని మెరుగుపరుచుటకు ప్రస్తుతం మూడు స్మార్ట్ స్త్రీట్ వెండింగ్ మార్కెట్లను మధురవాడ జోన్, ఆర్ఆర్ఆర్ సెంటర్ సమీపంలో సౌత్ జోన్ సెంట్రల్ పార్కు సమీపంలో, గాజువాక జోన్ దువ్వాడ ఫ్లై ఓవర్ వద్ద 14 కోట్ల అంచనా వ్యయంతో మాడ్యులర్ కంటైనర్ మోడల్ లో అన్ని మౌలిక సదుపాయాలతో 250 వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ రోడ్లు అనుసంధానం కొరకు నాలుగు ప్రధాన రహదారులను బంగ్లామెట్ట జంక్షన్ నుండి భీమిలి పోలీస్ స్టేషన్ వరకు 4.60 కి.మీ, అంబేద్కర్ జంక్షన్ నుండి జీరుపేట జంక్షన్ వరకు 1.30 కి.మీ, వేపగుంట నుండి పినగాడి వరకు 3.30 కి.మీ, వేపగుంట నుండి జుత్తాడ వరకు 6.50 కి.మీ పొడవుతో సుమారు 71 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించడమైనది.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ళు: విశాఖ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సౌకర్యం, రక్షణ దిశగా గాజువాక, మధురవాడ, ముడసరలోవ ప్రాంతాలలో ప్రత్యేక సహాయ రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి పథకం (SASCI) కింద 172 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లను నిర్మాణానికి శ్రీకారం చుట్టడమైనది.
15వ ఆర్థిక సంఘం నిధులతో నగరంలో వాయు నాణ్యతను మెరుగుపరచడం, వివిధ ప్రదేశాల్లో 20 ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం, 14 ట్రాఫిక్ జంక్షన్లను మెరుగుపరచడం, ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ వంటి 32 పనులను 129 కోట్ల 25 లక్షల తో చేపట్టబడినవి. 222 కోట్లతో 11 నీటి సరఫరా, 4 మురుగునీటి రీసైకిలింగ్, 2 పారిశుద్ధ్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, 3 నీటి వనరుల పునరుద్జీవనం మొదలగు 20 పనులు చేపట్టబడుచున్నవి. 94 కోట్ల 41 లక్షలతో అగనంపూడి నుండి అనకాపల్లి హెడ్ వాటర్ వర్క్స్ వరకు, అగనంపూడి నుండి నరవ వరకు శుద్ధి చేసిన మంచినీటి సరఫరా పైప్ లైన్ పనులు, అగనంపూడి (2200 KL GLBR) నుండి నరవ వరకు 800 MM వ్యాసం గల DI K7 పైప్ లైన్ వేయు పనులు పురోగతిలో ఉన్నవి. పద్మనాభపురం నుండి హనుమంతవాక వరకు పైప్ లైన్ పని ప్రారంభ దశలో ఉన్నది. *నీటి సరఫరా ప్రాజెక్టులలో కొనసాగుతున్న పనులలో భాగంగా ఉత్తర పశ్చిమ నియోజకవర్గాలలో 447 కోట్ల 62 లక్షలతో ADB నిధులతో 24×7 మంచినీటి సరఫరా పథకం పని చేపట్టగా 75 శాతం పని పూర్తయినది.
అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా అభివృద్ధి కొరకు 27 ప్రాజెక్టులు 356 కోట్ల 42 లక్షలతో చేపట్టగా, 4 ప్రాజెక్టు పనులు పూర్తయినవి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నవి. *అమృత్ 2.0 పథకంలో భాగంగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి కొరకు 296 కోట్ల 68 లక్షలతో రెండు ప్రాజెక్టు పనులు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నవి.
వీధి దీపాల నిర్వహణ: జీవీఎంసీ అన్ని వార్డులలో 1 లక్ష 18 వేల ఎల్ఈడి వీధి దీపాలు ఉండగా, వివిధ జోన్ లలో విస్తరించబడిన ప్రాంతాల్లో 10,545 వీధి దీపాలు ఏర్పాటుకు 6 కోట్ల 71 లక్షల అంచనాలతో పనులు చేపట్టబడింది. అందులో జీవీఎంసీ నందు వివిధ ముఖ్యమైన రహదారుల్లో ఉన్న ఆధునిక విద్యుత్ దీపాల యొక్క 70 కిలోమీటర్ల మేర పొడవున భూగర్భ కేబుల్స్ స్థానంలో కొత్త కేబుల్స్ వేయుటకు 9 కోట్ల 84 లక్షల అంచనాలతో పనులు ఆమోదించబడినవి.
నీటి సరఫరా విభాగం: విశాఖ నగరం 681.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అన్ని ప్రాంతాలలో గల 22.97 లక్షల ప్రజలకు సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయబడుతుంది. త్రాగునీరు మరియు పారిశ్రామిక వినియోగాల కోసం నగరానికి రోజుకి సుమారు 87 MGD నీటిని 7 ప్రధాన నీటి వనరుల ద్వారా సరఫరా చేయబడుచున్నది. జీవీఎంసీ విలీన ప్రాంతాల్లో 219 పైలెట్ వాటర్ సప్లై స్కీములు ఉన్నాయి. 98 వార్డుల్లో అదనంగా 8224 హ్యాండ్ బోర్ వెల్స్ ద్వారా నీటి వినియోగం జరుగుచున్నది. ప్రతిరోజు 45 నుండి 60 నిమిషాల వరకు కుళాయిల ద్వారా, బోర్ వెల్స్, ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయబడుచున్నదని తెలియజేయుచున్నాము.
నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలు: జోన్ 2లో (మధురవాడ, ముడసర్లోవ) 85 MLD నీటి సరఫరా అభివృద్ధికి 595 కోట్లతో పనులు ప్రతిపాదించడమైనది. మధురవాడ భూగర్బ మురుగునీటి సౌకర్యం కొరకు 553 కోట్లతో వ్యయంతో డిపిఆర్ ను ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపడమైనది. భీమిలి వద్ద 8 ఎకరాల విస్తీర్ణంలో పిపిపి మోడల్ లో 15 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలించబడినవి.
హార్టికల్చర్ విభాగం: జీవీఎంసీ పరిధిలో 24 లక్షల వృక్షాలు నాటబడి, 133 కిలోమీటర్ల రోడ్డు సెంట్రల్ మీడియన్ లు, 172 ఉద్యానవనాలు, పార్కులతో విశాఖ నగరం 32 శాతం పచ్చదనం అభివృద్ధి చెంది ఉన్నది. 2025-26 సంవత్సరంలో మొత్తం 1282 ఖాళీ స్థలాల్లో 740 ఖాళీ స్థలాలను గ్రీన్ పార్కులుగా అభివృద్ధి, స్థానిక జాతి మొక్కలతో పాటు పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేయడమైనది. 200 పార్కులు, 72 ట్రాఫిక్ ఐలాండ్స్, 48 కిలోమీటర్లు గ్రీన్ బెల్ట్, 133 కిలోమీటర్లు రోడ్డు సెంటర్ మీడియన్స్, సైడ్ మీడియన్స్, ఫౌంటెన్ సిస్టంతో బీచ్ ఫ్రంట్ పార్కులతో నగరంలో పచ్చదనం అభివృద్ధి చేయబడినది.
పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం (యుసిడి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మహిళల ఆర్థిక బలోపేతానికి తగిన కార్యక్రమాలు అయిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఏపీ టిడ్కో పిఎంఏవై (అర్బన్), వన్ సెంట్ హౌసింగ్, స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతం, బ్యాంకు లింకేజీ, ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం, పీఎం విశ్వకర్మ యోజన, ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్, పట్టణ నిరాశ్రయుల ఆశ్రయాలు, డిజిటల్ లక్ష్మి, మహిళాకాశం, లీఫ్ (లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ ఆక్సిల్రేషన్ ప్రోగ్రాం) కార్యక్రమం, స్ట్రీట్ వెండర్స్, తృప్తి క్యాంటీన్లు, ఉమెన్ ఫర్ ట్రీస్, పీఎం సూర్య ఘర్, హోం స్టే, అక్షర ఆంధ్ర, స్మైల్ అమృత మిత్ర వంటి కార్యక్రమాలు జీవీఎంసీ ద్వారా జరుగుచున్నవని తెలియపరుచుచున్నాము. 2025-26 సంవత్సరం గాను వీధి విక్రయదారుల కొరకు సర్వే నిర్వహించి 18 వేల మంది వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది.
అన్న క్యాంటీన్లు: 3 కోట్ల 33 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 25 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ జరిపి సెప్టెంబర్ 2024 నుంచి 4 డిసెంబర్ 2025 వరకు మొత్తం 91 లక్షల 84 వేల మంది ప్రజలు అన్న క్యాంటీన్ ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లను కమిషనర్ తో సహా జీవీఎంసీ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నిర్వహణను గమనిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన నిర్వహణ జరుగుచున్నదని, సగటున రోజుకి 25,727 మంది ప్రజలు అన్న క్యాంటీన్ లు వినియోగించుకుంటున్నారు.
ప్రజారోగ్య విభాగం: విశాఖ నగర ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికులు, జివిఎంసి యంత్రాంగ విశేష కృషితో స్వచ్ఛ సర్వేక్షన్ 2024 వ సంవత్సరమునకు గాను జాతీయస్థాయిలో సఫాయిమిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీకి ప్రథమ స్థానం దక్కింది. అలాగే GFC 5 స్టార్ రేటింగ్ ను మెరుగుపరచుకొని బహిరంగ మల, మూత్ర విసర్జన నియంత్రణలో, వాటర్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ ను జీవీఎంసీ దక్కించుకుందని తెలియపరుచుచున్నాము.
కాపులప్పాడ లో బయోమైనింగ్ పద్ధతి ద్వారా 11.32 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రీమీడియట్ చేసి 33.50 ఎకరాల భూమిని పునరుద్ధరించి 2000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం జరుగుచున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలను ప్రతి నెల మూడవ శనివారం ప్రజల భాగస్వామ్యంతో నగరంలో నిర్వహించడం జరుగుచున్నది. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాములను, రక్షణ, భద్రతకు వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం, నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన హ్యాండ్ బుక్ ను అందించడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 36 వాహనాలు అందించడం జరిగింది. మాన్యువల్ స్కావెంజర్స్ లు, వ్యర్ధాలను ఏరుకునేవారు మరియు వారిపై ఆధారపడిన వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక సహాయం మరియు శిక్షణ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుచున్నది. నగరంలో సీజనల్ వ్యాధులను అదుపు చేయుటకు నియంత్రణ చర్యలను చేపడుతూ నిత్యం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుచున్నది. నగరంలో 1772 పశువులను పట్టుకొని 15 లక్షల 34 వేల రూపాయలు జరిమానాలను వసూలు చేయడం జరిగినది. వీధి కుక్కలను నియంత్రించుటకు నిత్యం యాంటీబత్ కంట్రోల్ సర్జరీలు నిర్వహించడం జరుగుచున్నది. 2024-25 సంవత్సరంలో దాదాపు 6,800 పంతులను కాల్చి చంపడం అయినది. 18,767 పందులను పట్టుకోగా 12,020 పందులు మిగిలి ఉన్నవి. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 1,462 జననములు కాగా 1,389 మరణములు సంభవించినవి.
పట్టణ ప్రణాళికా విభాగం: పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా 2025-26 సంవత్సరముగాను 3,373 బిల్డింగ్ అప్లికేషన్లను మంజూరు చేయగా 180 కోట్ల 83 లక్షల రూపాయలు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా 4,573 అప్లికేషన్లకు గాను 2,628 పరిష్కరించగా, 1,945 పరిష్కార దిశలో ఉండగా 78 కోట్ల 29 లక్షల 12 వేల రూపాయలు జీవీఎంసీ కి ఆదాయంగా చేకూరింది. బిపిఎస్ స్కీం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా డిసెంబర్ 18 నాటికి 795 బిపిఎస్ అప్లికేషన్లు స్వీకరించడం జరిగినది. అవి పరిష్కార దశలో ఉన్నవి. *నగరంలో 75.65 కిలోమీటర్ల పొడవున 21 మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నవి.
ఆర్థిక విభాగం: 2024-25 సంవత్సరములో ఆస్థి పన్ను, ఖాళీగా పన్నుల ద్వారా సుమారు 510.32 కోట్లు జివిఎంసి కి వసూలు కాగా, 2025-26 సంవత్సరమునకు 600 కోట్ల ఆస్తి పన్నులు వసూలు లక్ష్యంగా, 2025 ఏప్రిల్ ఒకటి నుండి డిసెంబర్ 15 వరకు 357.85 కోట్లు వసూలు చేయుట జరిగినది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రభుత్వం కల్పించిన ఎర్లీ బర్డ్ ఆఫర్ ద్వారా 5 శాతం పన్ను రాయితీని నగర ప్రజలు అధికంగా వినియోగించుకోవడం ద్వారా 161.82 కోట్లు జీవీఎంసీకి ఆదాయం చేకూరింది. నేటి వరకు నూతనముగా మరియు మదింపు చేయబడిన ఆస్తి పన్ను అసెస్మెంట్ల ద్వారా సుమారు 90 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను డిమాండ్ ను జీవీఎంసీ పెంచుకొనుట జరిగినది. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 20 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా నగర అభివృద్ధిలో సారధులైన ఆస్తి పన్ను చెల్లింపుదారులను గౌరవించు నిమిత్తం గత మూడు సంవత్సరములు సకాలంలో ఎక్కువ ఆస్తి పన్ను చెల్లించిన ఉత్తమ వ్యక్తిగత ఆస్తిపన్ను దారులను, ప్రభుత్వ రంగ సంస్థలను, వయోవృద్ధులను, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను ఎంపిక చేసి “విశాఖ ప్రగతి బంధు” పేరున సన్మానించుట జరిగినది.
జీవీఎంసీ బాల్యం విద్యా పథకంలో భాగంగా నగరంలో 30 బాల్యం విద్యా కేంద్రాలు సక్రమంగా నిర్వహించబడుచున్నవి. ప్రతి విద్యా సంవత్సరంలో 600 కు తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి యందు నమోదుకు 3 నుండి 5 సం.ల విద్యార్థినీ విద్యార్థులకు విద్యను అందిస్తూ బాల్యం విద్యా కేంద్రాలను జివిఎంసి అభివృద్ధి పరుస్తున్నదని తెలియపరుచుచున్నాము. 2025-26 విద్యా సంవత్సరంలో బాల్యం విద్యా కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్న నలుగురు విద్యార్థులు 20 రాష్ట్రాలకు సంబంధించి 150 జిల్లాల నుంచి 250 మంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు విద్యార్థిని విద్యార్థులతో చేపట్టిన ఈ జాతీయ స్థాయి లైవ్ కాంపిటీషన్లో విజేతలుగా నిలవడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో 2025 జనవరి 1 నుండి నేటి వరకు జీవీఎంసీకి ప్రజల నుండి ఫిర్యాదులు/వినతులు 12,332 అందగా 11,489 పరిష్కరింపబడినవి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి. అంతే కాకుండా PGRS కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబందించి ప్రజల నుండి అధికంగా పిర్యాదులు వస్తున్న సందర్భంగా వాటిని తగ్గించే దిశగా ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని జివిఎంసి ప్రధాన కార్యాలయం నందు నిర్వహించడం జరుగుచున్నది.
క్రీడలు విభాగం: విశాఖ సుందర బీచ్ లో ప్రజలకు, విహారయాత్రికులకు ప్రాణాలకు రక్షణ కల్పించే దిశగా కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి బీచ్, అప్పికొండ, యారాడ బీచ్ వరకు, మేఘాద్రి గెడ్డ, ముడసర్లోవ ప్రాంతాలలో 47 మంది బీచ్ లైఫ్ గార్డులను జీవీఎంసీ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తోంది.
2025లో జీవీఎంసీ పొందిన అవార్డులు:
1) జివిఎంసి యంత్రాంగ విశేష కృషితో స్వచ్ఛ సర్వేక్షన్ 2024 వ సంవత్సరమునకు గాను జాతీయస్థాయిలో సఫాయిమిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీకి ప్రథమ స్థానం దక్కింది.
2) 47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ-2025 జాతీయ అవార్డులు.
- బెస్ట్ సి.ఎస్.ఆర్. ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం.
- బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం.
- ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం.
కేటగిరీలలో జాతీయ అవార్డులు జివిఎంసి కైవసం చేసుకుంది.
విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే జి.వి.ఎం.సి కి ఈ ఉత్తమ జాతీయ స్థాయి అవార్డులు దక్కాయని తెలియపరుచుచున్నాను.
ప్లాస్టిక్ రహిత నగరంగా, పర్యావరణహితంగా, సుందర నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుటకు, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించుటకు జివిఎంసి యంత్రాంగం నిత్యం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. స్వచ్చ విశాఖ అభివృద్ధి దిశగా విశాఖ నగర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ, ఎకో వైజాగ్ అభివృద్ధికి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు నుండి విశాఖ నగరానికి విముక్తిని కలిగించేందుకు, అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ 2025లో కూడా విశాఖ నగరం ప్రథమ స్థానం సాధన దిశగా సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, కౌన్సిల్ సభ్యులకు, ప్రజాసంఘాలకు, నివాసిత సంక్షేమ సంఘాలకు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లకు, సినీ, క్రీడా ప్రముఖులకు, ఎస్.హెచ్.జి. మహిళా సంఘ సభ్యులకు, ఆర్.పి.లకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, మరీ ముఖ్యంగా విశాఖ నగరం నిత్యం పరిశుభ్రంగా ఉండేందుకు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు, జీవీఎంసీ అధికారులకు, ఉద్యోగులకు, సహకరిస్తున్న విశాఖపట్నం నగర ప్రజలకు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
- జై హింద్ –















