గుజరాత్ జెయింట్స్ తొలి విజయం
37-28తో తమిళ్ తలైవాస్‌పై గెలుపు
ప్రొ కబడ్డీ సీజన్ 12.. కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ 12లో గుజరాత్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. శనివారం విశాఖపట్నంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 12 లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై 37-28తో గుజరాత్ జెయింట్స్ గెలుపొందింది. ప్రథమార్థంలోనే ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్.. ద్వితీయార్థంలో ఆధిక్యం 9 పాయింట్లకు మెరుగుపర్చుకుంది. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ నితిన్ పన్వార్ (8 పాయింట్లు), రెయిడర్ రాకేశ్ (6 పాయింట్లు), ఆల్‌రౌండర్ మహ్మద్రెజా (6 పాయింట్లు), రెయిడర్ శ్రీధర్ (6 పాయింట్లు) , రెయిడర్ హిమాన్షు (4 పాయింట్లు) సమిష్టిగా రాణించారు. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ పవన్ షెహ్రావత్ (6 పాయింట్లు), రెయిడర్ అర్జున్ దేశ్వాల్ (5 పాయింట్లు), డిఫెండర్ నితిన్ కుమార్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పీకెఎల్12లో మూడు మ్యాచుల్లో గుజరాత్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం కాగా.. మూడు మ్యాచుల్లో తమిళ్ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం.



డిఫెన్స్‌లో గుజరాత్ పైచేయి :
తమిళ తలైవాస్‌పై గుజరాత్ జెయింట్స్ ప్రథమార్థంలో ఆరు పాయింట్ల ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్ నితిన్ పన్వార్ మూడు సూపర్ ట్యాకిల్స్‌తో జెయింట్స్‌ను ముందంజలో నిలిపాడు. తొలి పది నిమిషాల్లో గుజరాత్ 10 పాయింట్లు, తలైవాస్ ఏడు పాయింట్లు సాధించాయి. తర్వాత పది నిమిషాల్లో తలైవాస్ 5 పాయింట్లే సాధించగా, జెయింట్స్ ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వెనుకంజ వేసిన తలైవాస్ ప్రథమార్థం ఆటను ఆరు పాయింట్ల లోటుతో ముగించింది.
దూకుడు పెంచిన జెయింట్స్ :
విరామం తర్వాత ఇరు జట్ల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. గుజరాత్ జెయింట్స్‌ను ఆలౌట్ చేసి తమిళ్ తలైవాస్ పుంజుకున్నా.. జెయింట్స్ వేగంగా కోలుకుంది. రెయిడింగ్, ట్యాకిల్స్‌తో తలైవాస్‌ను కోర్టు ఖాళీ చేసింది. సెకండ్‌హాఫ్‌లో తలైవాస్ ఆటతీరు మెరుగైనా.. ప్రథమార్థం లోటు ఆ జట్టును వెనక్కి లాగింది. నితిన్ పన్వార్, రాకేశ్, మహ్మద్రెజాలు గుజరాత్ జెయింట్స్‌కు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిపెట్టారు. దీంతో ఆ జట్టు 37-28తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది.















