అంగరంగ వైభవంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
*భాగస్వామ్యమైన ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సీపీ, జేసీ, రాజకీయ, అధికార ప్రముఖులు
*వివిధ స్కీమ్ల కింద రూ.214.99 కోట్ల నగదు ప్రోత్సాహకల పంపిణీ, 375 మందికి ప్రతిభా పురస్కారాలు
*సంక్షేమానికి, అభివృద్ధికి అద్దంపడుతూ స్టాళ్లు, శకటాల ఏర్పాటు, అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలువిశాఖపట్టణం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా.. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీతో కలిసి మంత్రి ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ జడ్. విజయ్ కుమార్ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్.సి.సి. క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి మంత్రి, వేదికపై ఆశీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ద్వితీయ శ్రేణి కమాండర్లుగా ఆర్ఎస్సైలు తిరుపతిరావు, వి. నారాయణరావులు వ్యవహరించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ అతిథులంతా జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను మంత్రి, కలెక్టర్ గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. జిల్లాను మరింత పురోగతి దిశలో పయనింపజేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పరేడ్ మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని, దేశ సమగ్రతను చాటి చెప్పాయి. దేశభక్తి గీతాలతో.. గేయాలతో.. నృత్యాలతో విద్యార్థినీ, విద్యార్థులు అందరినీ అలరించారు. జ్ఞానాపురం సేక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులచే దేశమంటే.. దేశమంటే… మతం కాదోయ్ అనే గేయ నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆసాంతం అలరింపజేశాయి. భరతమాత బిడ్డలురా.. బోర్డర్లో ఒరిగెనురా అంటూ నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అంటూ పద్మనాభం కేజీబీవీ స్కూల్ విద్యార్థులు, భారతీయ సమరస భావన ధీమ్ తో తగరపువలస కేథరిన్ పాఠశాల విద్యార్థులు, వందేమాతర… సుందర భారతం.. అంటూ పెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏతో.. కాశ్మీర్.. హై.. అంటూ విశాఖ వ్యాలీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. వేడుకకు హాజరైన అధికారులు, ప్రముఖులు కరచాల ధ్వనులతో విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ మంత్రి, కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. వారితో బృంద చిత్రాలు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రగతిని తెలియజేస్తూ ఎనిమిది శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ఉద్దేశాలను తెలుపుతూ జీవీఎంసీ, భవిష్యత్తు విశాఖ కొరకై సుస్థిరమైన మౌలిక వసతుల అభివృద్ధి అనే థీమ్ తో వీఎంఆర్డీఏ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, తల్లికి వందనం పథకం గురించి వివరిస్తూ విద్యాశాఖ, నా ఆరోగ్యం – నా హక్కు అనే అంశంతో వైద్యారోగ్య శాఖ, ఎన్టీఆర్ పేదలందరికీ ఇళ్లు పథకంపై గృహ నిర్మాణ శాఖ, పేదరికం రహితం -పీ4 విధానం పేరుతో ప్రణాళికా విభాగం, పీఎం సూర్యఘర్ ఆవశ్యకతను తెలుపుతూ ఈపీడీసీఎల్ శకటాలను ప్రదర్శించాయి.హర్ ఘర్ తిరంగా అనే అంశంపై సమాచార శాఖ ప్రత్యేక స్టాల్ పెట్టగా, సంక్షేమ పథకాలను వివరిస్తూ డీఆర్డీఏ, జీవీఎంసీ-యూసీడీ, ఐసీడీఎస్, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖలు, డ్వామా, మత్స్యశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, వైద్యారోగ్య శాఖ, బీసీ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, ఏపీఎంఐపీ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కలెక్టర్, జేసీ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలు బాగున్నాయని అందరికీ కితాబిచ్చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లో చిన్నారులతో ముచ్చటించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని స్టాళ్ల వద్ద పుంగనూరు ఆవుకు అరటి పండు తినిపించిన మంత్రి దానితో సరదాగా ఫోటో దిగారు. అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాల కింద రూ.214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.సంక్షేమానికి, అభివృద్ధికి అద్దంపడుతూ సాగిన శకటాల ప్రదర్శనలో గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన శకటం ప్రథమం స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో జీవీఎంసీ శకటం, మూడో స్థానంలో సమగ్ర శిక్షా, విద్యాశాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన శకటం నిలిచింది. పీఎం సూర్యఘర్ అంశాన్ని వివరిస్తూ ఏపీడీసీఎల్ ఏర్పాటు చేసిన శకటం ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. ఆయా శాఖల అధికారులను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.
375 మందికి ప్రతిభా పురస్కారాలు
ఉత్తమ సేవలందించిన అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఐఏఎస్ అధికారులైన వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జేసీ కె. మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు సంగీత్ మాధుర్, ఎస్. సుధాసాగర్, పి. శేషశైలజ, బి.వి. రమణ మంత్రి నుంచి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 31 మంది జిల్లా స్థాయి అధికారులు, మిగిలిన కింది స్థాయి అధికారులు, సిబ్బంది పురస్కారాలు స్వీకరించారు. మొత్తం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 375 మందికి అవార్డులు ప్రదానం చేశారు.




వేడుకల్లో విశాఖపట్టణం ఎంపీ శ్రీభరత్, శాసన మండలి విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్టుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్. భవానీ శంకర్, న్యాయ, పోలీసు, రెవెన్యూ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు















