సత్యసాయి యూనివర్సిటీ, పుట్టపర్తి తెలుగు శాఖ ఆచార్యులు, అవధాన సుధాకర, అవధాన భారతీ, శతావధాని ఆచార్య డా। రాంబట్ల పార్వతీశ్వర శర్మగారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య డా॥ కూటికుప్పల సూర్యారావు గారిని తన కార్యాలయములో కలిసి దుశ్శాలువతో సన్మానించి తాను రచించిన వెంకటేశ్వర శతకము, పాదుకా పట్టాభిషేకము అను పలు గ్రంధములను బహుకరించారు. ఈ సందర్భంగా డా॥ కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతూ యువ శతావధాని డాక్టర్ రాంబట్ల గారి ప్రతిభను ఆయన అవధాన ప్రక్రియలో మెలుకువలను స్నిగ్ధప్రౌఢ లలితపద పుష్పాలతో పద్యాలు వ్రాసే పార్వతీశ్వర శర్మగారి వికాశాన్ని శ్లాఘించారు.
ఈ సందర్భంగా తెలుగు వానికే సొంతమైన అవధాన ప్రక్రియను కళాశాలలో ప్రొత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని డా|| సూర్యారావుగారు కోరారు. అంతే కాకుండా ఫిబ్రవరి 22వ తేదీ ప్రజోత్పత్తి నామ సంవత్సరం మాఘ శుక్ల చతుర్ధశి గురువారం అవధాన పితామహుడు శ్రీ మాడభూషి వేంకటాచార్యులు వారు మొదటి అవధానం చేసిన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రుల ఆత్మగౌరవం అవధాన దినోత్సవంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీ రాంబట్లగారు మాట్లాడుతూ వృత్తిపరంగా వైద్యుడైన డా॥ కూటికుప్పల తెలుగు భాష పట్ల మక్కువతో తెలుగు వైభవాన్ని పునరుద్ధరించడానికి “తెలుగువీర లేవరా… సూర్యకిరణాలు” అను గ్రంధములను రచించి తెలుగు భాషకు కూడా సముచిత సేవలు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

















