అపోలో మెడికల్ కాలేజీలో జరిగిన “ఎకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా” జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. కూటికుప్పల సూర్యారావు ఫ్యామిలీ ఫిజిషియన్స్ వ్యవస్థను పునరిద్ధరిస్తే దేశంలో కరోనా, టి. బి., హెచ్.ఐ.వి కి పూర్తిగా చరమ గీతం పాడవచ్చని, ఈ దిశగా ప్రభుత్వాలు చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
పాతరోజుల్లో “కుటుంబ వైద్యుడు” లేని ఇల్లు ఉండేది కాదు. అందుకే ఆ రోజుల్లో మానసిక రోగాలు, లైఫ్ స్టైల్ డిసీజెస్ నామమాత్రంగా ఉండేవి. ఈ రోజున అనేక కుటుంబాలకు సరైన వైద్య సలహా లేక, అనవసర వైద్య ఖర్చుల ఉచ్చులో పడి పేదరికాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
బ్రిటన్ లాంటి ఎన్నో ఐరోపా దేశాల్లో ఈ రోజుకి ఫ్యామిలీ ఫిజిషియన్స్ వ్యవస్థ ఎంతో గణనీయంగా పటిష్టంగా పనిచేస్తుంది. ప్రతి మెడికల్ కాలేజీలో ఎం.డి ఫ్యామిలీ మెడిసిన్ ప్రారంభించాలని జాతీయ సదస్సు తీర్మానం చేసింది. ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్లకు ప్రభుత్వంలో కేడరు సృష్టించి వారి సేవల్ని ప్రైమరీ హెల్త్ కేర్ లో ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని డా. జయప్రకాష్ నారాయణ విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ కోరారు. డా.సుజాత రావు ఐ.ఏ.ఎస్ విశ్రాంత కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫ్యామిలీ మెడిసిన్ ను విస్మరించడం ఆరోగ్య భద్రత లో పెద్ద లోపం అని చెప్పారు.
సదస్సులో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఛైర్మన్ డా. శ్రీనాధ రెడ్డి, అంతర్జాతీయ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. సదస్సు నిర్వాహకులు, ముఖ్య అతిధులు నిమ్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ శాంతారాం, సి.ఎం.సి వేల్లూరు, అపోలో మెడికల్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ దిలీప్ మత్తై, ఎయిమ్స్ డైరెక్టర్ డా. భాటియా, సెయింట్ జాన్ మెడికల్ కాలేజ్ బెంగళూర్ ప్రొఫెసర్ రవీంద్రన్ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ను ఘనంగా సత్కరించి ప్రశంసా ఫలకం ను బహుకరించారు.


















