ఈ నెల 26,27వ తేదీల్లో శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి ఆన్లైన్ టిక్కెట్ల జారీ ప్రారంభమయ్యింది in Vizagnagram,Vizagvision
శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి ఆన్లైన్ టిక్కెట్లు
జారీ ఈ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్ హరి జవహర్లాల్
ఒరిజనల్ టిక్కెట్, ఆధార్ కార్డు ఉంటేనే దర్శనానికి అనుమతి
జిల్లా యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి
విజయనగరం, అక్టోబరు 22 ః ఈ నెల 26,27వ తేదీల్లో శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి ఆన్లైన్ టిక్కెట్ల జారీ ప్రారంభమయ్యింది. విజయనగరం ఎన్ఐసి ఈ విధానాన్ని అభివృద్ది చేసింది. స్థానిక ఉడా కాలనీలోని 48వ నెంబరు వార్డు సచివాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ గురువారం టిక్కెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ఆన్లైన్ లో టిక్కెట్ల జారీ ప్రక్రియను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవిడ్- నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, భక్తుల రక్షణ, శ్రేయస్సు కోసం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 43 సచివాలయాల ద్వారా గురువారం నుంచీ ఆన్లైన్ లో టిక్కెట్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరంలో 5, ప్రతీ మండల కేంద్రంలో ఒకటి చొప్పున, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలిలో అదనంగా సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. గంటకు సుమారు 400 మంది అమ్మవారిని దర్శించుకొనే విధంగా ఏర్పాట్లు చేసి, టిక్కెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. తొలేళ్లరోజు సోమవారం ఉదయం 5 గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు, మంగళవారం తెల్లవారుఝామున 3 గంటలు నుంచి ఉదయం 8 గంటలు వరకు మాత్రమే దర్శనాలకు టిక్కెట్లు జారీ చేస్తున్నామన్నారు. సచివాలయాల్లో తమ ఆధార్ కార్డును చూపించి, రూ.200 చెల్లించి టిక్కెట్లను పొందవచ్చని సూచించారు. ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్నవారు, ఒరిజనల్ టిక్కెట్, ఆధార్ కార్డులను తీసుకొని దర్శనాలకు రావాల్సి ఉంటుందన్నారు. టిక్కెట్‌పై నిర్ణయించిన సమయానికి మాత్రమే రావాలని, ముందుగానీ, వెనుక గానీ వచ్చినవారిని అనుమతించడం జరగదని తెలిపారు. ఎవరి టిక్కెట్ వారికి మాత్రమే పనిచేస్తుందని, వేరేవారిని అనుమతించడం కుదరదని స్పష్టం చేశారు.
తొలేళ్లు, సిరిమానోత్సవం, ఈ రెండు రోజుల్లో బస్సులు, ఆటోలు తదితర రవాణా వాహనాలను నిలిపివేస్తున్నందున, తమ సొంత వాహనాల్లోనే ఆలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. మాస్కులను ధరించినవారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్యూలైన్లలో భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, మరోసారి వ్యాధి విజృంభించకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అందువల్లే అమ్మవారి సిరిమానోత్సవానికి పలు నిబంధనలను అమలు చేస్తున్నామని, భక్తులు అర్ధం చేసుకొని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహించి, నెగిటివ్ వచ్చినవారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అలాగే ఆలయం వద్ద ప్రసాదం ఇచ్చే వారికి సైతం కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సిరిమాను సంబరానికి భక్తులకు అనుమతి లేదని, తమ ఇళ్లవద్ద లేదా, వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న ఎల్ఇడి స్క్రీన్లవద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉత్సవాన్ని తిలకించాలని కలెక్టర్ కోరారు.