అప్పన్నకు 26న చందనోత్సవం 18న ఏకాదశి సందర్భంగా తొలిగంధం చెక్క అరగదీతకు శ్రీకారం in Visakhapatnam,Vizagvision…సింహాచలేశునికి సమర్పించే గంధం అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నెల 18న ఏకాదశి సందర్భంగా తొలిగంధం చెక్క అరగదీతకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ బాంఢాగారం నుంచి బుధవారం 32.8 కిలోల చందనం చెక్కలను బయటకు తీసి ముక్కలుగా కత్తిరించారు.
అప్పన్న ఆలయ చరిత్రలోనే తొలిసారిగా భక్తులు లేకుండా ఈ నెల 26న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఏడాదంతా చందనంతో దర్శనమిచ్చే స్వామివారు వైశాఖ శుద్ధ తదియ రోజు నిజరూపంలో భక్తులను కనువిందు చేస్తారు. ఈసారి తక్కువ మంది వైదికులు, సిబ్బంది సమక్షంలో ఈ తంతు పూర్తి చేస్తామని ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్, స్థానిక మంత్రి, పాలకమండలితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేవస్థానం యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు
















