కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. నర్సీపట్నంలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధిపై ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో ఒక జోకర్ లా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై అవసరమైతే తాను నియమించుకున్న సలహాదారుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
14 రోజులకే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అనడం దారుణమైన విషయంగా ఆయన పరిగణించారు. వీటికోసం ప్రధానమంత్రిని అడగడం వరకూ బాగానే ఉన్నా, ఇలాంటి సమయంలో రెండు రోజుల క్రితం తన బినామీ కాంట్రాక్టర్లుకు రూ. 6,800కోట్ల బిల్లులు ఎందుకు మంజూరు చేశారో ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పంటలు, ఫౌల్ట్రీ పంట ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు
అన్ని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షా కేంద్రాలు, రెండేసి వెంటిలేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కరోనా పరీక్షలు మరింత శులభతరం అవుతాయని ఆయన సూచించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు, వచ్చిన విరాళాల నిధుల్లో ఖర్చుల వివరాలను బులిటెన్ రూపంలో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీతాల రూపంలో వేల కోట్లు ఖర్చుచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ఉండగా రేషన్ సరుకులు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.
నర్సీపట్నంలో మరిడిమాంబ పండగను డిజిటల్ పద్ధతిలో టీవీల్లో ప్రసారం చేస్తామని, కరోనా ఆంక్షలు నేపధ్యంలో ఎవరూ గుడికి రావద్దని అయ్యన్న పాత్రుడు స్థానిక ప్రజలకు సూచించారు.
















