మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షణ కోసం రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
ఆదివారం సాయంత్రం విజయవాడలో ని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ‘ పవర్ వాక్ ” నిర్వహించారు. పవర్ వాక్ ర్యాలీ తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిర్వహించారు. మహిళా శక్తి నడక (పవర్ వాక్) ర్యాలీ లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎమ్ డి ఇంతియాజ్, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశా చట్టం ప్రత్యేక అధికారిణి కృతికాశుక్లా, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలభద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకుని రావడం తో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. షరతులు లేని సమానత్వం మహిళలకు కావాలి అనే నినాదం తో పవర్ వాక్ ర్యాలీని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా మన్నారు. మహిళలు ఎప్పుడైతే స్వేచ్ఛగా సమాజములో తిరగ గలుతారో అప్పుడే మహిళలకు పూర్తి స్వేచ్ఛ కల్పించిన వారం అవుతామన్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా లింగ వివక్షత ద్వారా సంభవించే సాంఘీక దురాచారాల బారిన మహిళలు పడకుండా, వారి హక్కులు హరించకుండా మహిళా కమిషన్ పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్న దన్నారు. అదేవిధంగా వారిలో చైతన్యము కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న దన్నారు. మహిళలు స్వేచ్ఛ గా పబ్లిక్ ప్రదేశాల్లో అన్ని వేళల్లో ప్రవేశించే హక్కు ఉందని, ఆదిశలో మహిళా కమిషన్ వారిని సమర్ధిస్తున్న దని ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రజల్లోనూ, ముఖ్యంగా మహిళల్లో, విద్యార్థిని, విద్యార్థుల్లో అవగాహన కోసం , వారిలోని భావజాలంలో మార్పు కోసం ‘పవర్ వాక్ ” ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామన్నారు. మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున “పవర్ వాక్ ” కార్యక్రమాలు చేపడుతున్న ట్లు తెలిపారు. అందులో భాగంగా మార్చి 5న, కర్నూలులో, 6న రాజమండ్రి లో, 7వ తేదీన విశాఖపట్నం మహిళలు తో ర్యాలీ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ ఎమ్ డి ఇంతియాజ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు చైతన్య వంతమైన కార్యక్రమాల్లో పోటీ పడుతున్నారన్నారు. యుక్తిలోను, శక్తిలోను, మేధా సంపత్తి లోను పురుషులకు ధీటుగా వారి ప్రతిభను చాటుకోవడము జరుగుతోందన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు , పురుషులతో సమానంగా పని చెయ్యగలం అని నిరూపిస్తూ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశా చట్టం ప్రత్యేక అధికారిణి కృత్తికా శుక్లా మాట్లాడుతూ, మహిళలు స్వేచ్ఛ గా బహిరంగ ప్రదేశాల్లో అన్ని వేళల్లో ప్రవేశించే హక్కు ఉందన్నారు. ఆదిశలో మహిళా కమిషన్ వారిని సమర్ధిస్తుందన్నారు. మహిళ భద్రత కు, హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ ద్వారా విశేషం గా కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం తీసుకుని రావడం ద్వారా మహిళలకు సత్వర న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల్లోనే దోషికి శిక్ష పడే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
దిశా చట్టం అండగా… మన కుండగా ..అటు అత్యంత అట్టహాసంగా పవర్ వాక్ నిర్వహించారు. ఆడ పిల్లలు అబలలు కాదు సబలలు, షరతులు లేని సమానత్వం మహిళలకు కావాలి , సమాన హక్కులు సమాన అవకాశాలు కావాలి, వత్యాసం – అమరికలు లేకుండా జీవిద్దాం, మహిళలను తక్కువ చేయటం జరగకుండా ఉండేటట్లు చేద్దాం, ఏ విధంగానూ మహిళలు తక్కువ కాదు, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు మనవే అంటూ పలు నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
ఈ ర్యాలీలో ఐసిడిఎస్ పిడి ఉమారాణి, విజయవాడ నగర మాజీ మేయర్ లు ముత్తంశెట్టి రత్న బిందు, తాడి శకుంతల, అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


















