అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మాంసం అంటే చాలా ఇష్టం. అలాగే మెక్‌డొనాల్డ్స్ ఉత్పత్తులు, డైట్ కోక్ వంటివి ఎక్కువగా ఇష్టపడతారు. రెండ్రోజుల భారత పర్యటనలో… ఆయనకు కేంద్ర ప్రభుత్వం… వెజిటేరియన్ (శాఖాహారం) ఆహారాల్ని ఇవ్వబోతోంది. ఫార్చూన్ లాండ్ మార్క్ హోటల్లో ప్రముఖ చెఫ్ సురేష్ ఖన్నా… ఈ ఆహార పదార్థాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మొదటిసారి భారత్ వస్తున్న ట్రంప్‌కి సురేష్ ఖన్నా… ప్రధాని మోదీ చెప్పినట్లుగా… గుజరాతీ ఆహార పదార్థాల్ని అహ్మదాబాద్‌లో వండుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ట్రంప్ ముందుగా వెళ్లేది… సబర్మతీ ఆశ్రమానికే. అక్కడ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకూ హై టీ, చిన్నపాటి అల్పాహారం ఇవ్వబోతున్నారు. ఈ హై టీ, అల్పాహారం చేసిపెట్టే విషయాన్ని ఆదివారం మాత్రమే సురేష్ ఖన్నాకు సమాచారం ఇచ్చారు. అందువల్ల టీ తోపాటూ… రుచికరమైన ఫార్చూన్ కుకీస్ (బిస్కెట్లు), అలాగే గుజరాత్లో ఫేమస్ అయిన నైలాన్ ఖమాన్ దోఖ్లాను ఇస్తున్నారు. అలాగే… బ్రకోలీ, మొక్కజొన్న పొత్తుల సమోసా, సిన్నమోన్ యాపిల్ పై (దాల్చినచెక్క యాపిల్ పై – పిజ్జా లాంటిది), కాజీ లర్కీ వంటివి అల్పాహారంగా ఇస్తున్నారు. వీటితోపాటూ… అల్లం, మసాలా చాయ్ కూడా తయారుచేస్తున్నట్లు సురేష్ ఖన్నా తెలిపారు. ఈ అల్లం, మసాలా చాయ్ అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం.
ఆహారాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఇదివరకు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు అదిరిపోయే ఐటెమ్స్ పెట్టించేవారు. అప్పట్లో చాలా మంది ప్రముఖులకు సురేష్ ఖన్నా… మోదీ చెప్పిన ఐటెమ్స్ ప్రిపేర్ చేసి పెట్టారు. గత 17 ఏళ్లుగా ఆయనే ఇవన్నీ చేస్తున్నారు. అందువల్లే ఈసారి కూడా సురేష్ ఖన్నాకే మోదీ ఛాన్స్ ఇచ్చారు. ఈ హై టీ తీసుకున్న తర్వాత… ట్రంప్, ప్రధాని మోదీ కలిసి… మోతేరా క్రికెట్ స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.