శారదా స్వరూపం… కాషాయం అపురూపం!
కృష్ణా తీరంలో రెండో రోజు ఎగసిపడిన ఆధ్యాత్మిక అల!
– స్వామి స్వరూపానందేంద్ర దివ్య ఆశీస్సులు
– బాల స్వామికి సన్యాసాంగ అష్ట శ్రాద్ధాలు… రేపు యోగపట్టా అనుగ్రహం
– స్వాములు, నేతలు, భక్త జనంతో కిక్కిరిసిన కరకట్ట
అమరావతి: శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. శారదా స్వరూపంగా స్వామి స్వరూపానందేంద్ర దివ్య ఆశీస్సులు అందించగా, కాషాయ ధారణకు బాల స్వామి సిద్ధమవుతున్నారు. కృష్ణా నదీ తీరంలో ఉండవల్లి కరకట్టపై గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో, శారదా పీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవంతో రెండో ఆధ్యాత్మిక అలలు వీచాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే కృష్ణా నదీ తీరంలో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు అనంతరం శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహించారు. బాల స్వామి దగ్గరుండి స్వామి స్వరూపానందేంద్ర బాల స్వామితో హోమాలు నిర్వహింపజేశారు. చంద్ర మౌళీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భారతీయ తత్వ వేదాంత శాస్త్రాలను ఇప్పటికీ పరిరక్షిస్తున్నది ధర్మ పీఠాలేనని స్వామి వివరించారు. శారదా పీఠం ట్రస్టీలు బి. నరసింహారెడ్డి, ఎన్. సుబ్బారావు, రొబ్బి శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ధర్మాధికారి కామేశ్వర శర్మ, సిమ్స్ అధినేత బి.భరత్ రెడ్డి, డాక్టర్ బి.శివ శిరీషలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాయంత్రం శారదా, రేణుకా దేవి సన్నిధిలో యువ కళాకారిణుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
రేపు కీలక ఘట్టం … ఉత్తరాధికారిగా బాలస్వామి
శారదా పీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవంలో ఆఖరి రోజు కీలక ఘట్టం ఉంటుందని నిర్వాహకులు సిమ్స్ అధినేత బి. భరత్ రెడ్డి, డాక్టర్ బి.శివ శిరీషలు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్కుమార్ శర్మ కాషాయ వస్త్రధారణతో ఆఖరి రోజు దర్శనిమిస్తారని వివరించారు. చివరి రోజు ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగ పట్టా అనుగ్రహం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముగింపు ఘట్టంలో ముగ్గురు సీఎంలు కేసీయార్, జగన్, నవీన్ పట్నాయక్ లు హాజరవుతున్నారని భరత్ రెడ్డి తెలిపారు.
స్వరూపానందేంద్రను దర్శించుకున్న ప్రముఖులు
రెండో రోజు విశిష్ట పవిత్ర పుణ్యకార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకొని వారి మంగళశాసనాలను స్వీకరించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి, మోపిదేవి వెంకటరమణ, అన్నం రెడ్డి అదీప్ రాజ్, దాడి వీరభద్రరావు, సోము వీర్రాజు ఎమ్మెల్యేలు కొలుసు పార్ధసారధి, కరణం ధర్మశ్రీ,తదితరులు విచ్చేసి స్వామివారిని ఆశీస్సులు పొందారు.

















