ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ & బ్యూటిఫుల్ సినిమా `కొత్తగా మా ప్రయాణం`. యామిని భాస్కర్ కథానాయిక. `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ షేడ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్‌తో పాటు పంచ్ డైలాగ్‌లు వర్కవుటయ్యాయని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది.
దర్శకుడు రమణ మాట్లాడుతూ-“నలుగురికి సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. నలుగురికి సాయపడే తత్వం ఉన్న అతడికి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సాంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకుని అటుపై ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. నెలకు 2లక్షల జీతం అందుకునే సాఫ్ట్వేర్ కుర్రాడి కథ ఇది. ప్రియాంత్ కి తొలి సినిమానే అయినా తడబడకుండా చక్కగా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆ ఇద్దరికీ పేరొస్తుంది. యువతరాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు. భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, కరుణాకర్, సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.