అధికారంలోకి వచ్చాక బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తాం
వైఎస్ చేసిన తప్పే చంద్రబాబు కొనసాగించారు
బాధ్యతాయుతమైన మైనింగ్ పాలసీయే జనసేన లక్ష్యం
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి శ్రీ పసుపులేటి బాలరాజు
ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లకుండా చూడటమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. పర్యావరణం పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానానికి జనసేన కట్టుబడి ఉందని, 2019లో పార్టీ అధికారంలోకి వస్తే బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉద్ధృతంగా మైనింగ్ జరుగుతున్నప్పుడు అదే పార్టీలో ఉండి దానిని వ్యతిరేకించిన వ్యక్తి పసుపులేటి బాలరాజు గారని, అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం మనస్ఫూర్తిగా ఆనందం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ పసుపులేటి బాలరాజు జనసేనలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కల్యాణ్ గారు పుష్పగుచ్చం ఇచ్చి, జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ..”జనసేన పార్టీ ప్రారంభించినప్పడు పెద్దస్థాయి, అనుభవం ఉన్న నాయకులు లేరు. అంతా టీనేజర్సే. మన ఆశయాలు బలంగా ఉంటే విలువలున్న నాయకులు వస్తారని ఆనాడు ముందడుగు వేశాం. ఆ ఆశయమే ఇవాళ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, శ్రీ పసుపులేటి బాలరాజుగారిని మన పార్టీలో చేరేలా చేసింది. పర్యావరణం పరిరక్షించే అభివృద్ధి ఉండాలనే ఆలోచన మమ్మల్ని కలిపింది. 150మందికి పైగా శాసనసభ సభ్యులను విశాఖ ఏజెన్సీకి తీసుకెళ్లి, గిరిజనుల పడుతున్నఅవస్థలు, ఆరోగ్య పరిస్థితి, వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించి ప్రజాప్రతినిధులు చలించేలా చేసిన మనోహర్ గారు, ఆ రోజు మనోహర్ గారికి అండగా నిలబడ్డ బాలరాజు గారు గురించి ఇటీవల పాడేరులో పర్యటిస్తున్నప్పుడు తెలిసింది. అలాంటి బాలరాజు గారు పార్టీలోకి రావడం సంతోషాన్ని ఇచ్చింది. బాలరాజు గారి సలహాలు, సూచనలు, ఆయన అనుభవం గిరిజన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఇటీవల వంతాడ గ్రామానికి వెళ్తే మైనింగ్ జరగడం లేదన్నారు… ప్రత్యక్షంగా వెళ్లి చూస్తే కొండల్ని పిండి చేస్తున్నారు. కేవలం 0.4 శాతం ప్రభుత్వానికి రాయల్టీ ఇచ్చి వేల కోట్లు దోచేస్తున్నారు. కనీసం వంతాడ గ్రామానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. రిజర్వ్ ఫారెస్ట్ లో అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్న రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడుంది? వంతాడ అక్రమ మైనింగ్ విషయంలో వైఎస్ . రాజశేఖర రెడ్డి చేసిందే పెద్ద తప్పు. అయితే దానికి కొనసాగించిన టీడీపీ ప్రభుత్వానిది ఇంకా పెద్ద తప్పు. 2014లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది గిరిజనుల హక్కులకు పరిరక్షిస్తారని. కానీ వారు గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్నారు. 2019లో జనసేన పార్టీ గెలుస్తుందా..? లేదా అని ఆలోచించకుండా సామాజిక మార్పే లక్ష్యంగా పార్టీలో చేరిన బాలరాజు గారికి మాటిస్తున్నా .. పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యతయుతమైన మైనింగ్ పాలసీ తీసుకురావడంతో పాటు, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తాం” అన్నారు.
* సామాజిక మార్పుకు కృషి చేస్తున్న నేత శ్రీ పవన్ కల్యాణ్ : శ్రీ పసుపులేటి బాలరాజు
జనసేనలో చేరిన శ్రీ పసువులేటి బాలరాజు మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కల్యాణ్ గారి అశయాలు, ఆలోచనలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఆయన చేసే మంచి ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరాను. నేను చిన్నతనంలోనే మండల అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేశాను. రాజకీయాల్లో సామాజిక మార్పు తీసుకురావడానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఉద్దానం సమస్య, వంతాడ మైనింగ్ వంటి సమస్యలు ఆయన వల్లే బయట ప్రపంచానికి తెలిశాయి. ఆయన చేసే మంచి పనుల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉంది. నాకు వ్యక్తిగత ఎజెండా గాని, వ్యక్తిగత నిర్ణయాలు లేవు. శ్రీ పవన్ కల్యాణ్ గారు అప్పగించిన పని త్రికరణశుద్దిగా నిర్వహిస్తాను” అన్నారు.